టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర చంద్రగిరి నియోజకవర్గంలో దిగ్విజయంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా తొండవాడలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ సర్కార్ పై లోకేష్ నిప్పులు చెరిగారు. విజయనగర సామ్రాజ్యంలో ఒక వెలుగు వెలిగిన ఈ చంద్రగిరి గడ్డ నేడు జగన్, చెవిరెడ్డి పుణ్యమా అంటూ ల్యాండ్ అండ్ మైన్, ఎర్రచందనం మాఫియాతో మసకబారిందని లోకేష్ అన్నారు.
వెంకన్న పాదాలు చెంతన నిలబడి ప్రజలతో మాట్లాడడం తన అదృష్టం అని లోకేష్ చెప్పారు. తాడేపల్లి పిల్లి జగన్ నాలుగేళ్లు ఇంట్లో పడుకొని యువగళం దెబ్బకు భయపడి పల్లెనిద్రకు వెళ్తానంటున్నాడని, ఇది యువగళం దెబ్బ అంటూ లోకేష్ ఎద్దేవా చేశారు. పాదయాత్రకు ముందు తాడేపల్లి జీవో నెంబర్ ఒకటి తెచ్చాడని, దాన్ని అడ్డుపెట్టుకొని తనను రోడ్లపై నిలబడనివ్వకుండా, మైక్ పట్టుకోనివ్వకుండా చేస్తున్నాడని ఆరోపించారు.
ఆఖరికి తన స్టూలు కూడా లాక్కుంటున్నాడని, జగన్ ది గవర్నమెంట్ ఆర్డర్ అయితే లోకేష్ ది పబ్లిక్ ఆర్డర్ అని, అందుకే తాను ప్రజల వద్దకు వస్తున్నానని చెప్పారు. తన దగ్గర వందలాది మంది పోలీసులు, వజ్రా వాహనం, ఇంటెలిజెన్స్ అధికారులను ఉంచుతున్నారని ఎద్దేవా చేశారు. జగన్ హామీ ఇచ్చినట్టుగా 2.3 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, 6500 పోలీసు ఉద్యోగాలు, మెగా డీఎస్సీలు ఇస్తే తన సౌండ్ వాహనాలను స్వచ్ఛందంగా ఇచ్చేస్తానని లోకేష్ సవాల్ విసిరారు.
జగన్ ది దరిద్రపు పాదం అని, కచ్చలూరు బోటు ప్రమాదంలో 51 మంది చనిపోయారని, ఎల్జి పాలిమర్స్ ఘటనలో 15 మంది, అన్నమయ్య డ్యాం ఘటనలో 62 మంది చనిపోయారని గుర్తు చేశారు. రాయలసీమకు పట్టిన శని జగన్ అని విమర్శించారు. సొంత బాబాయ్ ని చంపినవాడు, పేదలను వేధించేవాళ్లు అందరూ సైకోలేనని, ఈ పెద్ద సైకో జిల్లాకె పిల్ల సైకోని తయారు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
చంద్రగిరిలో 3 ‘సీ’లు ఉన్నాయని, చంద్రగిరి, చెవిరెడ్డి, చెవిలో పువ్వు అని సెటైర్లు వేశారు. ఎమ్మెల్యేగా, తుడా చైర్మన్ గా, టిటిడి బోర్డు మెంబర్ గా, ప్రభుత్వ విప్ గా నాలుగు పదవులు చేతిలో పెట్టుకొని చెవిరెడ్డి తిరుపతిని దోచుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే తమ్ముడు రఘు ఎక్కడ భూములు కనిపిస్తే అక్కడ దోచుకుంటున్నారని ఆరోపించారు. మన బాధలు పోవాలంటే సైకో పోవాలి సైకిల్ రావాలని పిలుపునిచ్చారు.