టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర కాకినాడలోని తునిలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా రైతులతో భేటీ అయిన లోకేష్ మరో మూడు నెలల్లో ప్రజా ప్రభుత్వం ఏర్పాటవుతుందని రైతులకు భరోసానిచ్చారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రానికి పరిశ్రమలను తీసుకొస్తామని, భారీ సంఖ్యలో ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ ప్రభుత్వంలో కియా వంటి పరిశ్రమలు తీసుకువచ్చి వేలాదిమందికి ఉపాధి కల్పించి వారి జీవితాలను మార్చివేశామని అన్నారు. ఫోన్ ల పరిశ్రమతో 6000 మంది ఉపాధి పొందారని గుర్తు చేశారు.
అయితే, తమ హయాంలో వచ్చిన ఎన్నో పరిశ్రమలను వైసిపి ప్రభుత్వం తరిమేసిందని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మత్స్యకారుల పొట్టగొడుతూ జగన్ తెచ్చిన జీవో నెంబర్ 217 ను టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే రద్దు చేస్తామన్నారు. ఉల్లిగడ్డకి బంగాళదుంపకి తేడా తెలియని వ్యక్తి మన ముఖ్యమంత్రి అయ్యాడని, టెన్త్ పేపర్లు కొట్టేసి పాస్ అయిన జగన్ ఎక్కడ చదివాడో తెలియదని ఎద్దేవా చేశారు. జగన్ మాటలు విన్నాక పాదయాత్ర చేసింది జగనా లేక డూపా అని అనుమానం కలుగుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
తుఫాను వలన రైతులు, మత్స్యకారులు నష్టపోయారని, వారిని పరామర్శించే మనసు జగన్ కు లేదని చురుకలంటించారు. చంద్రబాబు హయాంలో ఏపీ మత్స్యకారాంధ్రప్రదేశ్ అనిపించుకుందని, జగన్ హయాంలో ఫిష్ ఆంద్రా పెడితే ఫినిష్ ఆంధ్ర అనిపించుకుందని సెటైర్లు వేశారు. వంచనకు ప్యాంటు షర్టు వేస్తే జగన్ అని ఇటువంటి దద్దమ్మ ముఖ్యమంత్రి రాష్ట్రానికి అవసరం లేదని లోకేష్ చురకలంటించారు.