2019 ఎన్నికలకు ముందు నాటి ప్రతిపక్ష నేత జగన్…పాదయాత్ర చేస్తూ జనాలపై ముద్దులు కురిపించారు. ఒక్క చాన్స్..ఒకే ఒక్క చాన్స్ అంటూ ఖడ్గం సినిమాలో రవితేజలాగా కనిపించిన ప్రతి ఓటరును ప్రాధేయపడ్డారు. పోనీలే పాపం..ఇంతలా బతిమిలాడుతున్నాడు కదా అని జగన్ కు ఒక్క చాన్స్ ఇచ్చారు జనం. అంతే, సీన్ కట్ చేస్తే సీఎం అయిన తర్వాత జనానికి సీఎం జగన్ చుక్కలు చూపిస్తున్నారని లోకేష్ కూడా విమర్శించారు.
ఈ క్రమంలోనే గతంలో జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శలు గుప్పించారు. ఆనాడు పాదయాత్రలో జగన్ ముద్దులు పెడితే ఏదో ఉద్ధరిస్తాడని జనం మోసపోయారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఆనాడు ముద్దులు పెట్టిన జగన్ ఈనాడు మహిళలపై పిడిగుద్దులు కురిపిస్తున్నాడని దుయ్యబట్టారు. జగన్ పాలనలో మహిళలకు తీరని అన్యాయం జరుగుతోందని, డ్వాక్రా సంఘాల మహిళలను జగన్ సభలకు బలవంతంగా తరలిస్తున్నారని ఆరోపించారు. జగన్ సభలకు బలవంతంగా వచ్చిన జనం చప్పట్లు కొట్టకపోతే పెన్షన్, అమ్మఒడి కట్ చేస్తామని బెదిరిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా జగన్ ముద్దులపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా సెటైర్లు వేశారు. తాను కూడా జగన్ లాగా మహిళలకు ముద్దులు పెడితే తనపై దిశ చట్టం కింద కేసు పెట్టిస్తారేమోనంటూ చురకలంటించారు. ఆ ఉద్దేశ్యంతోనే తన పాదయాత్రను దిశ డీఎస్సీ ఒకరు అనుసరిస్తున్నారని లోకేష్ అన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు పాదయాత్ర చేస్తున్న తనపై, టీడీపీ నేతలపై కేసులు బనాయిస్తున్నారని లోకేష్ ఆరోపించారు.