టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండి నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఆక్వా రైతులతో లోకేష్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఉభయ గోదావరి జిల్లాల్లో రోడ్ల అధ్వాన్న స్థితిపై లోకేష్ సెటైర్లు వేశారు. పాదయాత్ర చేసేటప్పుడు పైకి చూసి చేయి ఊపే పరిస్థితి ఈ జిల్లాలలో లేదని, రోడ్డుపై ఉన్న గుంతలు చూసుకొని జాగ్రత్తగా నడవాల్సి వస్తోందని చురకలంటించారు. ఆగండ్రా బాబూ… ఇక్కడ గుంత ఉంది అని తనతోటి వారికి చెప్పాల్సి వస్తోందని చమత్కరించారు.
“మీరు కూడా భలే వాళ్లండీ! గతంలో నేను గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా జిల్లాకు వస్తే, ఎక్కడో ఒక గ్రామంలో పది గుంతలు ఉంటే అందరూ వచ్చి నా మీద యుద్ధం చేశారు. అలాంటిది ఈ రోజు గుంతల్లో రోడ్డు ఎక్కడ ఉందా అని వెతుక్కునే పరిస్థితి వస్తే… ఇక్కడెవరూ మాట్లాడడంలేదు’’ అని స్థానికులతో లోకేష్ సరదాగా వ్యాఖ్యానించారు. టీడీపీ అధికారంలోకి రాగానే ఉభయ గోదావరి జిల్లాలో వైట్ టాప్(సీసీ) రోడ్లు వేస్తామని, ఖర్చు ఎక్కువైనా ఆ బాధ్యత తమ పార్టీదేనని హామీనిచ్చారు.
ఆక్వా రంగానికి ‘జే’ (జగన్) గ్రహణం పట్టిందని, ఆక్వా పరిశ్రమను బలోపేతం చేస్తామని భరోసానిచ్చారు. ఆక్వా, నాన్ ఆక్వా జోన్ సాగుదారులందరినీ ఆదుకుంటామన్నారు. ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్తును రూ.1.50కే ఇస్తామని, ఏఎంసీ సెస్ ను 0.25కి తగ్గిస్తామని హామీనిచ్చారు. ఎక్కడి సెస్ అక్కడే ఖర్చు పెట్టేలా చర్చలు తీసుకుంటామని చెప్పారు.