రెండో రోజు సీఐడీ విచారణకు హాజరైన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్…విచారణ అనంతరం సీఐడీ అధికారులపై సెటైర్లు వేశారు. ఆధారాలు చూపకుండా విచారణ చేసి 2 రోజుల టైం వేస్ట్ చేశారని, నిన్నటి ప్రశ్నలే వాషింగ్ మిషన్లో దుస్తులు వేసినట్లు అటు ఇటు తిప్పి తిప్పి అడిగారని లోకేష్ ఎద్దేవా చేశారు. ఈ రోజు అడిగిన 47 ప్రశ్నలలో రెండో, మూడో కొత్తవి అని అన్నారు. లంచ్ కి ముందు బాహుబలి మాదిరి హెరిటేజ్ భూములను గూగుల్ ఎర్త్ లో చూపించారని సెటైర్లు వేశారు.
ఇక, నారా భువనేశ్వరి ఐటీ రిటర్న్ డాక్యుమెంట్లు సిఐడి అధికారుల దగ్గరున్నాయని, అవి వారికి ఎలా చేరాయో తెలుసుకునేందుకు ఐటీ శాఖకు లేఖ రాస్తానని లోకేష్ అన్నారు. రేపు విచారణకు రావాలంటూ ఈ రోజు కూడా 41ఏ నోటీసు..అదే లవ్ లెటర్ ఇస్తారేమో అని అధికారులను అడిగానని లోకేష్ పంచులు వేశారు. అయితే, అధికారులు సమాధానమివ్వలేదని అన్నారు. మరోవైపు, శుక్రవారంనాడు చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ నేపథ్యంలో లాయర్లతో సంప్రదింపులు జరిపేందుకు లోకేష్ ఢిల్లీ వెళ్లారు. అంతకుమందు కూడా ఢిల్లీలోనే ఉన్న లోకేష్..సీఐడీ విచారణ కోసం తాడేపల్లికి రెండు రోజుల క్రితం వచ్చిన సంగతి తెలిసిందే.