టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందే రాష్ట్రమంతటా పాదయాత్ర చేయాలని ప్లాన్ చేస్తున్నారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోన్న తెలిసిందే. పూర్తి స్థాయిలో ఏపీలోని 175 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేయాలని లోకేష్ అనుకుంటున్నారని టాక్ వస్తోంది. జనవరి 27 నుంచి 400 రోజులపాటు ఏకధాటిగా సాగేలా లోకేష్ పాదయాత్రను రూపొందిస్తున్నారని పుకార్లు కొంతకాలంగా వినిపిస్తున్నాయి.
ప్రతి నియోజకవర్గంలో 3 లేదా 4 రోజులు సాగేలా, ప్రతి నియోజకవర్గంలో ఒక బహిరంగ సభ ఉండేలా, ఎక్కువ భాగం గ్రామాల్లో పాదయాత్ర కొనసాగేలా చూసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. శని, ఆదివారాలలో కూడా నిర్విరామంగా మొత్తం 4 వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగేలా ప్రణాళికలు రచిస్తున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తన పాదయాత్ర పై తాజాగా నారా లోకేష్ అధికారికంగా సంచలన ప్రకటన చేశారు.
జనవరి 27 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టబోతున్నట్టుగా లోకేష్ స్వయంగా ప్రకటించారు. మంగళగిరిలో పర్యటిస్తున్న లోకేష్ బాదుడే బాదుడు కార్యక్రమం సందర్భంగా టిడిపి కార్యకర్తలతో మాట్లాడుతూ ఈ ప్రకటన చేయడం విశేషం. మంగళగిరి నియోజకవర్గంలో నాలుగు రోజుల పాటు తన పాదయాత్ర కొనసాగుతుందని లోకేష్ చెప్పారు. పాదయాత్ర నేపథ్యంలో ఏడాది పాటు తాను నియోజకవర్గానికి దూరంగా ఉంటానని చెప్పారు.
మంగళగిరి నియోజకవర్గాన్ని తన కంచుకోటగా మార్చుకున్నానని, అందుకే ఇక్కడ తనను ఓడించేందుకు జగన్ కుట్రలు చేస్తుంటారని, వాటిని స్థానిక టిడిపి నేతలు, కార్యకర్తలు తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో టిడిపిని గెలిపించే బాధ్యత తన భుజస్కందాలపై వేసుకోబోతున్నానని, మంగళగిరిలో టిడిపిని గెలిపించే బాధ్యతను టిడిపి నేతలు, కార్యకర్తలు భుజస్కంధాలపై పెడుతున్నానని లోకేష్ అన్నారు.