జగన్ పాలనలో గంజాయి, డ్రగ్స్ కు ఏపీ కేరాఫ్ అడ్రస్ గా మారిన సంగతి తెలిసిందే. దేశంలో డ్రగ్స్ ఏ మూలన పట్టుబడ్డా ఏపీకి సంబంధం ఉండడంపై విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే చంద్రబాబు సర్కార్ డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపింది. ఇకపై, గంజాయి అమ్మేవారి కుటుంబాలకు సంక్షేమ పథకాలు నిలిపివేసేలా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఈ రోజు జరిగిన కేబినెట్ సబ్ కమిటీ భేటీలో మంత్రి నారా లోకేష్ వెల్లడించారు.
ఇక, యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ పేరును ‘ఈగల్’ గా మార్చామని లోకేష్ అన్నారు. 10 మంది సభ్యులతో ఈగల్ కమిటీలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఏపీలో మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులు, హత్యాచారాలకు గంజాయి, డ్రగ్స్ కారణమని కూటమి ప్రభుత్వం తేల్చింది. ఈ క్రమంలోనే గంజాయి, డ్రగ్స్ ఉత్పత్తి, వాడకం అరికట్టేందుకు ఈ తరహా కఠిన నిర్ణయాలు తీసుకుంది. గంజాయి, డ్రగ్స్ పై నిఘా పెంచేందుకు ఈగల్ కు విస్తృతాధికారాలు కల్పించే దిశగా యోచిస్తోంది.