టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డిపై దాడి ఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఆ దాడి వైసీపీ మూకల పనే అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. అవినీతి, అక్రమాలను ప్రశ్నించినందుకు ప్రభుత్వం ఉలికిపడి ఈ తరహా దాడులకు పాల్పడుతోందని లోకేష్ ఆరోపించారు. టీడీపీ గొంతుకను బలంగా వినిపిస్తున్న ఆనం వెంకటరమణారెడ్డిని టార్గెట్ గా చేసుకుని దాడికి దిగిన వైసీపీ ఫ్యాక్షన్ ముఠాలకు తగిన గుణపాఠం చెబుతామని లోకేశ్ వార్నింగ్ ఇచ్చారు.
జర్మనీలో నాజీల దురాగతాలను ఏపీలో జగన్ కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నారని, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, విమర్శించడం నేరమా? అని నిలదీశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిని వేధించడం, అణచివేయడమే లక్ష్యంగా జగన్ పాలన సాగుతోందని దుయ్యబట్టారు.. రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా అమలవుతతోందా అని హైకోర్టు పదే పదే ప్రశ్నించడం రాష్ట్రంలో శాంతి భద్రతల దిగజారుడుతనానిని నిదర్శనమని మండిపడ్డారు. జగన్ తాత, తండ్రి వారసత్వ ఫ్యాక్షన్ రాజకీయాలను, దౌర్జన్యాలను, దోపిడి విధానాన్ని కొనసాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రాన్ని నేరగాళ్లకు అడ్డాగా మార్చారని, జగన్ సాధిస్తున్న దమనకాండకు ముగింపు పలికే రోజు దగ్గర్లోనే ఉందని అన్నారు. ఆనంపై దాడి చేసిన నిందితులను వెంటనే అరెస్ట్ చేసి… ఆనంకు తగిన భద్రత కల్పించాలని లోకేష్ డిమాండ్ చేశారు.