స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్టయిన టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు ప్రస్తుతం రిమాండ్ మీద జైల్లో ఉన్నారు. బాబును కక్ష పూరితంగా అరెస్టు చేశారని, దీని వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని ఆరోపిస్తూ టీడీపీ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మరోవైపు ప్రజలు కూడా బాబుకు మద్దతుగా నిలుస్తున్నారు. అటు ఆంధ్రప్రదేశ్తో పాటు ఇటు తెలంగాణలోనూ నిరసనగా ర్యాలీలు, ధర్నాలు చేస్తున్నారు. కానీ తెలంగాణలో ర్యాలీలకు ప్రభుత్వ అనుమతి లేకపోవడం ఇప్పుడు కేటీఆర్, లోకేష్ మధ్య మాటల యుద్ధానికి కారణమైందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఏపీ రాజకీయాలకు తెలంగాణకు ఎలాంటి సంబంధం లేదని తాజాగా కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఏపీలో చంద్రబాబు అరెస్టయితే తెలంగాణలో ర్యాలీలు తీయడమేంటని ప్రశ్నించారు. రాజమండ్రిలో దద్దరిల్లేలా ర్యాలీలు తీసుకోవాలని చెప్పారు. హైదరాబాద్లో ఉన్న ఐటీ డిస్టర్బ్ కావొద్దనే ఉద్దేశంతోనే ధర్నాలు, ర్యాలీలకు అనుమతివ్వలేదని కేటీఆర్ స్పష్టం చేశారు. ఏపీలో ఎక్కడైనా ర్యాలీలు తీసుకోవచ్చని, కానీ ఇక్కడ ర్యాలీలు చేస్తామంటే ఊరుకోమన్నారు. హైదరాబాద్ లో ర్యాలీలకు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని లోకేష్ ఫోన్ చేసి అడిగారని కేటీఆర్ వెల్లడించారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకూడదనే ఉద్దేశంతోనే పర్మిషన్ ఇవ్వలేదని చెప్పినట్లు కేటీఆర్ పేర్కొన్నారు.
పైగా తనకు జగన్, పవన్, లోకేష్.. ముగ్గురూ స్నేహితులేనని కేటీఆర్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. ఎవరితో ఎలాంటి విభేధాలు లేవని కేటీఆర్ చెప్పారు. చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా హైదరాబాద్లోని ఐటీ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసింది. అయితే ర్యాలీలు, ధర్నాలకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్న విషయమూ విదితమే. ఈ నేపథ్యంలో ఢిల్లీలో లోకేష్ దీనిపై స్పందిస్తూ.. కేటీఆర్ ఎందుకు ఉలిక్కిపడుతున్నారో అర్థం కావడం లేదనే అర్థం వచ్చేలా వ్యాఖ్యానించారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్లందరూ శాంతియుతంగా ఆందోళన నిర్వహిస్తున్నారని లోకేష్ అన్నారు. కానీ తెలంగాణలో ధర్నాలకు మాత్రం బీఆర్ఎస్ ఎందుకు ఉలిక్కిపడుతోందని లోకేష్ ప్రశ్నించారు.