టీడీపీ యువనాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ తనపాదయాత్రలో పంచ్‌లు పేలుస్తున్నారు. తాజాగా ఆయన పాదయాత్ర 80వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వంపైనా.. సీఎం జగన్‌పైనా పంచ్‌లో విమర్శలు గుప్పించారు. రాయలసీమ బిడ్డనని చెప్పుకొనే సీఎం జగన్ ఇక్కడి ప్రాంతానికి ఒక్క మంచి పనైనా చేశావా? అంటూ.. ప్రశ్నలుగుప్పించారు. “జగన్ ఇటుచూడు“ అంటూ సటైర్లు విసిరారు.
ఆదోని నియోజకవర్గం తుంబళం క్రాస్ విడిది కేంద్రం నుంచి 80వ రోజు పాదయాత్ర ప్రారంభమైంది. అనంతరం మంత్రాలయం నియోజకవర్గంలోకి లోకేష్ పాదయాత్ర ప్రవేశించింది. వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్‌పై లోకేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాయసీమలో ఒక్కమంచి పని అయినా చేశావా జగన్ అంటూ ప్రశ్నించారు. కరువుసీమలో సాగు, తాగునీరు అందించేందుకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పడిన కష్టం చూడు అంటూ సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు.
మంత్రాలయం నియోజకవర్గం గవిగట్టు శివార్లలో పులికనుమ బ్రాంచి కెనాల్ ఎడారిలో ఒయాసిస్సులా నీళ్లతో కళకళలాడుతూ కన్పించిందన్నారు. తుంగభద్ర ఎల్ఎల్ సి కెనాల్‌కు నీరు నిలిపివేసినప్పుడు ప్రత్యామ్నాయ సాగునీటి వనరుగా కోసిగి మండలం పులికనుమ వద్ద రూ. 261కోట్లతో చేపట్టిన ఎత్తిపోతల పథకాన్ని గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పూర్తిచేశారని గుర్తుచేశారు.
దీనిద్వారా 64 గ్రామాలకు తాగునీరు, 26 వేల ఎకరాలకు సాగునీరు అందించేలా డిజైన్ చేశారన్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దోచుకోవడం, దాచుకోవడం తప్ప రాయలసీమ ప్రజల కళ్లలో ఆనందం చూసేలా ఒక్క పనైనా చేశావా జగన్మోహన్ రెడ్డీ అంటూ లోకేష్ విరుచుకుపడ్డారు. ఇక్కడే సెల్ఫీని తీసుకుని.. వైసీపీ నేతలకు సవాల్ రువ్వారు.