జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. ‘జగన్’ నాటకాలకు యువత బలవుతోందని, జగన్ మాయమాటలు నమ్మి యువత మోసపోయారని అన్నారు. ప్రతి ఏటా జనవరి 1వ జాబ్ క్యాలెండర్ అని చెప్పిన జగన్ ఆ ఊసే ఎత్తడం లేదని లోకేశ్ మండిపడ్డారు. జగన్ పాలనలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ జరగలేదని దుయ్యబట్టారు.
ప్రతి ఏటా 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ అన్నారని, కానీ ఉద్యోగాలు రాక, ఉపాధి లేక యువత తీవ్ర నిరాశనిస్పృహల్లో కూరుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగాలు రాలేదని యువత అఘాయిత్యాలకు పాల్పడవద్దని లోకేశ్ విజ్ఞప్తి చేశారు. మరో 6 నెలలు ఓపికపడితే టీడీపీ ప్రభుత్వం వస్తుందని, యువత ఉద్యోగ, ఉపాధికి టీడీపీ భరోసా ఇస్తుందని లోకేశ్ హామీనిచ్చారు.
మరోవైపు, తెలుగు ప్రజలందరకీ లోకేశ్ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. అవినీతి, అరాచకం, అహంకారం అనే చీకట్లని చీల్చే వెలుగుల పండుగ దీపావళి అని, ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు చెప్పారు లోకేశ్. సమాజంలో చెడు ఏ రూపంలో ఉన్నా విజయం సాధించడమే దీపావళి అని, ప్రజలు సురక్షితంగా, సంతోషంగా పండుగ జరుపుకోవాలని లోకేశ్ ఆకాంక్షించారు.