మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ నాయకుడు ఆళ్ల రామకృష్ణా రెడ్డి.. వైసీపీకి, ఆయన శాసన సభ సభ్యత్వానికి కూడా రాజీనామా సమర్పించిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగిన వెంటనే .. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో భారీ ఎత్తున నాయకులు సంబరాలు చేసుకున్నారు. దీనికి కారణం.. ఇక్కడ నుంచి వచ్చే 2024 ఎన్నికల్లో పోటీ చేయనున్న నారా లోకేష్ గెలుపు ఖాయమని భావించడమే.
2019 ఎన్నికల్లో ఇక్కడ నుంచి పోటీ చేసిన నారా లోకేష్ 25 వేల ఓట్ల పైచిలుకు తేడాతో ఓడిపోయారు. అయినప్పటికీ.. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ నుంచే పోటీ చేస్తానని నారా లోకేష్ ప్రకటించారు. యువగళం పాదయాత్ర ప్రారంభానికి ముందు వరకు ప్రతి వారం ఇక్కడకు వెళ్లి సమస్యలు తెలుసుకున్నారు.ప్రతి మండలంలోనూ తిరిగారు. ప్రతి ఒక్కరికీ చేరువయ్యారు. అంతేకాదు.. స్థానికంగా చేతి వృత్తుల వారికి సాయం చేశారు.
ఇక, యువగళం పాదయాత్ర తర్వాత కూడా .. కార్యక్రమాలు ఆగిపోకుండా క్షేత్రస్తాయిలో నాయకులను కదిలిస్తున్నారు. ఇక, ఇప్పుడు బలమైన నాయకుడిగా ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేయడంతో ఇక, నారా లోకేష్ గెలుపు నల్లేరుపై నడకే అన్నట్టుగా మారుతుందని పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో నారా లోకేష్‌పై ఎవరిని నిలబెట్టినా.. ఓటమి ఖాయమని చెబుతున్నారు. ఇప్పటికే ఉన్న సింపతీతో పాటు.. వైసీపీ అంతర్గత విభేదాలు లోకేష్‌కు కలిసి వస్తాయని అంటున్నారు.
మరోవైపు.. టీడీపీపై పెరుగుతున్న సానుభూతి, నారా లోకేష్ యువగళం పాదయాత్ర వంటివి 70 శాతం వరకు ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లాయని.. ఆయన గెలుపు ఇప్పటికే నిర్ణయం అయిపోయిందని.. ఇప్పుడు ఆళ్ల రాజీనామాతో మరింతగా నారా లోకేష్ దూకుడు పెరుగుతుందని. స్థానిక నాయకులు అంచనావేస్తున్నారు. కచ్చితంగా నారా లోకేష్ అసెంబ్లీలో అడుగు పెడుతున్నారని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.