దాదాపు 216 రోజుల పాటు సాగిన యువగళం-నవశకం పాదయాత్ర తనకు ఎన్నో పాఠాలు నేర్పిందని టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. తాజాగా విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం పోలిపల్లి వద్ద ఏర్పాటు చేసి యువగళం భారీ బహిరంగ సభలో నారా లోకేష్ ప్రసంగించారు. “ఇది నవశకం.. యుద్ధం మొదలైంది. తాడేపల్లి తలుపులు బద్దలుకొట్టే వరకు ఈ యుద్ధం ఆగదు“ అని ప్రకటించారు.
“ప్రజలు పాదయాత్ర చేస్తే పోరాటం అవుతుంది. రాక్షస పాలనలో పోరాటం చేస్తే విప్లవం అవుతుంది. యువగళం.. మనగళం.. ప్రజాగళం. జగన్‌ది రాజారెడ్డి రాజ్యాంగం పొగరు. లోకేష్‌ది అంబేడ్కర్ రాజ్యాంగం పౌరుషం. యువగళం ముగింపు సభ కాదు.. ఆరంభం మాత్రమే. చంద్రబాబు, పవన్‌ను చూస్తే జగన్ భయపడతాడు. విజనరీ అంటే చంద్రబాబు.. ప్రిజనరీ అంటే జగన్“ అని నారా లోకేష్ అన్నారు.
జగన్ అరెస్టు అయితే రోజుకో స్కాము బయటపడేదని నారా లోకేష్ అన్నారు. ప్రజాస్వామ్యాన్ని జగన్ దెబ్బతీశారని, రూ.లక్ష కోట్లు దోచేసిన వ్యక్తి పేదవాడు అవుతారా? అని నిలదీశారు. “జగన్ అహంకారం.. ప్రజల ఆత్మగౌరవానికి మధ్య యుద్ధం జరుగుతోంది. మూడు నెలల్లో ప్రజాస్వామ్యం పవర్ ఏంటో చూపాలి“ అని సభకు వచ్చిన వారిని ఉద్దేశించి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
సటైర్లే సటైర్లు!
నారా లోకేష్ తన ప్రసంగంలో సటైర్లపై సటైర్లు వేశారు. “జగన్ ఐపీఎల్ టీమ్ పేరు కోడికత్తి వారియర్స్. కోడికత్తి వారియర్స్ ఆటగాడు అవినాష్‌రెడ్డి. బెట్టింగ్ స్టార్ అనిల్ యాదవ్.. అరగంట స్టార్ అంబటి. గంట స్టార్ అవంతి.. ఆల్ రౌండర్ గోరంట్ల మాధవ్. రీల్ స్టార్ భరత్. పించ్ హిట్టర్ బియ్యపు మధుసూదన్‌రెడ్డి“ అని వ్యాఖ్యానించారు. ఈ పంచ్‌ల కు సభలో జనాలు పగలబడి నవ్వడం గమనార్హం.
యువగళం పాదయాత్ర ఎన్నో పాఠాలు నేర్పిందని నారా లోకేష్ వ్యాఖ్యానించారు. అడుగడుగునా జగన్ విధ్వంసం కనిపించిందన్నారు. గాడి తప్పిన రాష్ట్రాన్ని సరైన గాడిలో పెడతామని నారా లోకేష్ చెప్పారు. వచ్చేది టీడీపీ-జనసేన ప్రభుత్వమేనన్నారు. ఈ విషయంలో ప్రజలు తిరుగులేని విజయం అందించాలని ఆయన పిలుపునిచ్చారు.