టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ అగ్రనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర పల్నాడు జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే లోకేష్ పాదయాత్ర గురజాల నియోజకవర్గంలోని పిడుగురాళ్లకు చేరుకుంది. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ పై లోకేష్ నిప్పులు చెరిగారు. జగన్ అంత పిరికోడిని తాను ప్రపంచంలో చూడలేదని ఎద్దేవా చేశారు. లోకేష్ పాదయాత్ర చేసినా, చంద్రబాబు గారు ప్రాజెక్టుల పర్యటన చేసినా జగన్ కు భయమేనని చురకలంటించారు. జగన్ ప్యాలెస్ వదిలి ప్రజల్లోకి వెళ్ళడని, పబ్జి ఆడుకుంటూ పడుకుంటాడని సెటైర్లు వేశారు.
అదే తాము ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రజల్లోకి వెళితే మాత్రం వైసీపీ కార్యకర్తలను పంపించి తమపై రాళ్లు వేయిస్తారని విమర్శలు గుప్పించారు. రాళ్లేస్తే పారిపోయేందుకు తనది బులుగు జండా కాదు బ్రదర్ అన్నారు. రాళ్లేస్తాం, ఫ్లెక్సీలు చించుతాం అంటూ ఎవడైనా వస్తే నెక్స్ట్ బర్త్ డే ఉండదంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇక పబ్జి జగన్ ఇంట్లో దొంగలు పడ్డారని అది వినగానే తనకు డౌట్లు వచ్చాయని అన్నారు. దొంగలు పడినప్పుడు జగన్ ఏం చేస్తున్నాడు? దొంగ ఇంట్లో దొంగలు ఎలా పడ్డారు? అని లోకేష్ ప్రశ్నించారు జగన్ డిజిటల్ సైన్ ఉపయోగించి 225 ఫైళ్లు సెటిల్ చేశారని, కోట్లు చేతులు మారాయని, ఆ టైంలో జగన్ పబ్జి ఆడుతున్నాడని చురకలంటించారు.
420 పక్కన 420లే ఉంటారని, అందుకే జగన్ కు తెలియకుండా ఆయన సంతకాన్ని వాడుకున్నారని ఆరోపించారు. అటెండర్లు, డేటా ఆపరేటర్ల పై కేసులు పెట్టి చేతులు దులుపుకున్నారని, కానీ, ఈ స్కాం వెనుక మాస్టర్ మైండ్ ఎవరో బట్టబయలు చేయాలని డిమాండ్ చేశారు.
ఇక, తన బాబాయి వివేకా జయంతిని అబ్బాయిలు మర్చిపోయారని, కానీ, వర్ధంతి మాత్రం డేట్, టైమ్ తో సహా గుర్తుంటుంన్న సంగతి సీబీఐ నిర్ధారించిందని సెటైర్లు వేశారు. వేటు వేసిన చేతులతో బాబాయ్ జయంతికి ట్వీటు వేస్తే బాగోదనే జగన్ ట్వీట్ చేయలేదని అన్నారు. ఈ పోరాటంలో సునీత గెలుస్తారని, తన తండ్రిని చంపిన కన్నింగ్ కజిన్స్ తో ఊచలు లెక్క బెట్టించే వరకు విశ్రమించరని అన్నారు. ఈ రోజు వివేకా జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నానని ట్వీట్ చేశారు.