ఏపీలో టీడీపీ నేతలు, టీడీపీ కార్యాలయాలపై వైసీపీ శ్రేణుల దాడి వ్యవహారం పెను దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. టీడీపీ నేతలపై మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అనుచిత వ్యాఖ్యలు చేసిన వైనం సద్దముణగక ముందే…మైదుకూరు వైసీపీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది. మంగళగిరిలో కాబట్టి టీడీపీ కార్యాలయంపై దాడి చేశారని, అదే రాయలసీమలో అయితే ఖూనీలు జరిగేవని రఘురామిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. టీడీపీ ఫ్యాన్స్ కు బీపీ వస్తే నువ్వు ఏపీలో ఉండలేవు జగన్ రెడ్డి అంటూ లోకేశ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తన సైకో ఫ్యాన్స్ కు బీపీ వచ్చి టీడీపీ కార్యాలయంపై దాడి చేశారని సైకో రెడ్డి కూడా అంగీకరించాడని, సైకో రెడ్డిని కూడా నిందితుడిగా చేర్చాలని లోకేశ్ డిమాండ్ చేశారు. తమకూ లక్షలాది మంది ఫ్యాన్స్ ఉన్నారని, వాళ్లకి కోపం వస్తే జగన్ ఏపీలో ఉండలేడని హెచ్చరించారు.
వైఎస్ రాజశేఖర్రెడ్డి ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీలో చంద్రబాబు తల్లిని దూషించలేదా?, వైసీపీ మంత్రులు బూతులు తిట్టలేదా? అని లోకేశ్ ప్రశ్నించారు. ఇవేమీ తెలియనట్లు జగన్రెడ్డి ప్రదర్శిస్తున్న నటనకు భాస్కర్ అవార్డు ఇవ్వొచ్చని లోకేశ్ ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నంబరు నిజంగా సవాంగ్ కు తెలియదా? తన పోస్టింగ్ కోసం ఆయన చంద్రబాబుకు నాలుగైదుసార్లు ఫోన్ చేయలేదా? ఇంటిముందు పడిగాపులు పడలేదా? అని లోకేశ్ నిలదీశారు.
తాను బోర్న్ రెడీ (పుట్టుకతోనే సిద్ధంగా ఉన్నాను) అని, తాను దేశాన్ని దొబ్బి జైలుకు వెళ్లడం లేదని లోకేశ్ అన్నారు. ప్రజాసమస్యలపై పోరాడిన తనపై ఇప్పటికే 9 కేసులు పెట్టారని అంటున్నారని, ఇంకా ఎన్ని పెట్టారో తెలియదని, కానీ జైలుకు వెళ్లాల్సి వస్తే తాను సిద్ధమని లోకేశ్ అన్నారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తే సామాన్యుల ప్రాణాలు తీస్తున్నారని, ఇది ఎక్కువరోజులు సాగదని లోకేశ్ వార్నింగ్ ఇచ్చారు. ఇంకోసారి దాడులు జరిగితే తలలు పగులుతాయని హెచ్చరించారు. పీకే పనిచేసినా ఈసారి వైసీపీ ఓటమిని ఎవరూ ఆపలేరని లోకేశ్ స్పష్టం చేశారు.
మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి వ్యాఖ్యలను ఖండించిన లోకేశ్…ఆయనను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. రఘురామిరెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వీడియోను లోకేశ్ ట్వీట్ చేశారు. టీడీపీ కార్యాలయాలపై జరిగిన దాడిని ఖండించాల్సిన సీఎం…సమర్థించడంపై లోకేశ్ మండిపడ్డారు. టీడీపీ ఆఫీసులపై దాడి విషయంలో జగన్ వైఖరిని ప్రతిపక్ష నేతలంతా ముక్తకంఠంతో ఖండించిన సంగతి తెలిసిందే