ఏపీలో జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికలు రోజుల్లోకి వచ్చేశాయి. త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుందన్న అంచనాలు వ్యక్తమవుతున్న వేళ.. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సంచలన హామీ ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ‘శంఖారావం’ యాత్రను షురూ చేసిన వేళలో.. గేమ్ ఛేంజర్ లాంటి ప్రకటన లోకేశ్ నోటి నుంచి వెలువడింది. రానున్న ఎన్నికల్లో విజయం టీడీపీదే అన్న ధీమాను వ్యక్తం చేసిన ఆయన.. తమ ప్రభుత్వంలో ప్రతి ఏడాది డీఎస్సీ వేస్తామన్నారు. 2019 ఎన్నికలకు ముందు 23 వేల పోస్టులతో డీఎస్సీ ఇస్తామని వైసీపీ హామీ ఇచ్చిందని.. ఆ తర్వాత 18 వేల పోస్టులే ఉన్నాయని చెప్పారన్నారు.
స్కూల్ రేషనలైజేషన్ పేరుతో పోస్టులు తగ్గించిన జగన్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు నామమాత్రంగా 6 వేల పోస్టులతో నోటిఫికేషన్ ఇవ్వటాన్ని ప్రస్తావించారు. ఎన్టీఆర్.. చంద్రబాబులు తాము ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు డీఎస్సీ ద్వారా 1.70లక్షల పోస్టులు భర్తీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఆయన నోట కీలక వ్యాఖ్య చేశారు. ‘‘వచ్చేది మన ప్రభుత్వమే. ప్రతి సంవత్సరం డీఎస్సీ నిర్వహిస్తాం’’ అని వ్యాఖ్యానించారు. భావోద్వేగాల్ని తట్టి లేపేలా మాట్లాడిన లోకేశ్.. ‘‘ఉత్తరాంధ్ర అమ్మలాంటిది. అమ్మ ప్రేమకు కండీషన్స్ ఎలా ఉండవో.. ఇక్కడి ప్రజలు అంతే. పౌరుషాలు.. పోరాటాలకు మారుపేరు శ్రీకాకుళం జిల్లా. గరిమెళ్ల సత్యనారాయణ.. గౌతు లచ్చన్న.. ఎర్రన్నాయుడు పుట్టిన గడ్డ ఇది. ఇలాంటి ప్రాంతంలో శంఖారావం లాంటి యాత్రను ప్రారంభించటం అదృష్టంగా భావిస్తున్నా’’ అని వ్యాఖ్యానించారు.
టీడీపీ పాలనతో ఉత్తరాంధ్రను జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా గా మారిస్తే.. జగన్ పాలనలో గంజాయి క్యాపిటల్ గా మార్చారన్నారు. నాలుగేళ్ల పాలనలో ఒక్క డీఎస్సీ ఇవ్వని జగన్.. ఇప్పుడు కొత్త నాటకం ఆడుతున్నారన్నారు. ‘‘మోసం.. దగా.. కుట్రకు ఫ్యాంటు షర్ట్ వేస్తే జగన్ లా ఉంటుంది. జగన్ సభలు చూస్తుంటే నవ్వొస్తోంది. దేనికి సిద్ధం? జైలుకు వెళ్లేందుకా? ఆయన తన కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించటం లేదు. తమకు భద్రత లేదని సునీత.. షర్మిల అంటున్నారు. సొంత చెల్లెళ్లకే భద్రత ఇవ్వకపోతే సాధారణ మహిళల పరిస్థితేంటి?’’ అంటూ మండిపడ్డారు.
దేశంలో వంద సంక్షేమ పథకాలకు కోత పెట్టిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని వ్యాఖ్యానించారు. ఇచ్చాపురానికి జగన్ ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్న ఆయన.. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్న హామీని ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన నోటినుంచి మరికొన్ని షాకింగ్ అంశాలు వెలుగు చూశాయి.
‘‘వైసీపీ భూకబ్జాలకు సహకరించలేదని విశాఖపట్నంలో తహసీల్దార్ రమణయ్యను కొట్టి చంపారు. చంద్రబాబుతో పాటు నాపైన ఎన్నో దొంగ కేసులు పెట్టారు. ఎన్ని కేసులు పెట్టినా తగ్గేది లేదు. చట్టాలను ఉల్లంఘించిన అధికారుల పేర్లు రెడ్ బుక్ లో ఉన్నాయి. వారిపై న్యాయవిచారణ జరిపిస్తాం. అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీతో సహా చెల్లిస్తాం’’ అని వ్యాఖ్యానించారు. ఒకింత ఆవేశం.. మరింత భావోద్వేగంతో పాటు.. సమస్యల పట్ల.. స్థానిక అంశాల మీదా తనకున్న పట్టును తన ప్రసంగంతో లోకేశ్ స్పష్టం చేశారని చెప్పాలి.