టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర మళ్లీ మొదలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే 23వ రోజు పాదయాత్ర ప్రారంభించిన లోకేష్ 300 కిలోమీటర్ల మైలురాయిని నిన్న శ్రీకాళహస్తిలో చేరుకున్నారు. నియోజకవర్గంలోని తొండమన్నపురం పంచాయతీలో 300 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ గ్రామ ప్రజలకు లోకేష్ వరం ఇచ్చారు. ఆ పంచాయతీ పరిధిలోని 13 గ్రామాల దాహార్తి తీర్చే రక్షిత మంచినీటి పథకాన్ని టిడిపి ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లో ఏర్పాటు చేస్తానని లోకేష్ హామీ ఇచ్చారు.
ప్రతి 100 కిలోమీటర్ల మైలురాయి చేరుకున్న సందర్భంగా ఏదో ఒక హామీ ఇవ్వడం లోకేష్ ఆనవాయితీగా పెట్టుకున్నారు. ఈ సందర్భంగానే జగన్ పై లోకేష్ సెటైర్లు వేశారు. కడప ఉక్కు ఫ్యాక్టరీ శంకుస్థాపనకు మూడోసారి వెళ్లిన జగన్ కొబ్బరికాయ కొట్టేందుకు కూడా వంగలేకపోయాడంటూ లోకేష్ ఎద్దేవా చేశారు. అటువంటి జగన్ కుర్రాడు అని ఫీల్ అవుతుంటాడని, 72 ఏళ్ళ వయసులో కూడా 27 ఏళ్ల కుర్రాడిలాగా పరుగులు పెట్టే చంద్రబాబును ముసలోడని విమర్శిస్తుంటాడని చురకలంటించారు.
ప్రజాశీస్సులతో 300 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకున్నానని ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు. జీవో నెంబర్ ఒకటి ప్రకారం మైకు తీసుకొని మాట్లాడకూడదని, తన చేతిలో మైక్ లేకపోయినా ఎందుకు భయపడుతున్నారని లోకేష్ ప్రశ్నించారు. స్టూల్ మీద నుంచి ప్రసంగించినా స్టూలు పట్టుకుపోతున్నారని చురకలంటించారు. అనపర్తిలో చంద్రబాబు సభకు అనుమతి ఇచ్చి లాస్ట్ మినిట్ లో రద్దు చేశారని, చీకట్లో ఏడు కిలోమీటర్లు నడిచి కూడా రోడ్ షో నిర్వహించిన ఘనత చంద్రబాబుదని కొనియాడారు.
అనపర్తి నుంచే జగన్ పతనం మొదలైందని, జగన్ ఎంత సతాయిస్తే అంత మాట్లాడతానని సవాల్ విసిరారు. సాఫీగా సాగనిస్తే పాదయాత్ర అడ్డుకుంటే దండయాత్ర అంటూ జగన్ ను లోకేష్ ఛాలెంజ్ చేశారు. జీవో నెంబర్ 1ని వ్యతిరేకించినా చట్టాన్ని గౌరవిస్తామంటూ లోకేష్ ఎంతో పరిపక్వతతో మాట్లాడారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు 25 వేల కిలోమీటర్ల సిసి రోడ్లు వేసి, లక్షలాది ఎల్ఈడి లైట్లు వేశామని, ఆ రోడ్ల మీదే ఆ లైట్ల వెలుగులోనే వైసీపీ నేతలు నడుస్తున్నారని లోకేష్ ఎద్దేవా చేశారు. మంత్రి కాకాణి కోర్టులో దొంగతనం చేసి సీబీఐ కేసుల్లో ఇరుక్కుని రైతుల సంక్షేమాన్ని గాలికి వదిలేశారని విమర్శించారు.