టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర ప్రస్తుతం రేణిగుంట చేరుకుంది. ఈ క్రమంలోనే రేణిగుంటలో ప్రసంగిస్తున్న లోకేష్ ను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఎప్పటిలాగే మైకు లేకుండానే మాట్లాడుతున్నప్పటికీ లోకేష్ స్టూలును లాక్కునేందుకు ఎస్ఐ ఒకరు ప్రయత్నించారు. ఈ సందర్భంగా ఆ ఎస్ఐపై లోకేష్ విరుచుకుపడ్డారు. నువ్వు వెళ్లి ఆ బడా చోర్ కు కాపలా కాసుకో అంటూ జగన్ ను ఉద్దేశించి పరోక్షంగా లోకేష్ వార్నింగ్ ఇచ్చారు.
‘ఎక్కువ మాట్లాడకు. ఎవరితో మాట్లాడుతున్నావ్. ఎస్సైవి అయ్యుండి నీవే శాంతిభద్రతల సమస్యను క్రియేట్ చేస్తున్నావ్. రేపు నువ్వు ఏపీలో ఉద్యోగం ఎలా చేస్తావో నేనూ చూస్తా. తమాషా చేస్తున్నావా? బీ కేర్ ఫుల్ ఎస్సై. నీవు ఎస్సై అయితే వెళ్లి నాపై కేసు పెట్టుకో. ఇక్కడ ఆటంకాలు కలిగించొద్దు.’ అంటూ ఆ ఎస్ ఐకి లోకేష్ ఇచ్చిన వార్నింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. మైక్ లేకుండా మాట్లాడుతున్నా ఎందుకు అడ్డుకుంటున్నారని, దీనికి ఎవరు పర్మిషన్ కావాలి అని లోకేష్ ప్రశ్నించారు.
జీఓ నెంబర్ ఒకటి ప్రకారం మైక్ వాడకూడదని, కానీ, ఇలా మైక్ లేకుండా మాట్లాడకూడదు అని వేరే రాజ్యాంగంలో ఉందా అని లోకేష్ ప్రశ్నించారు. టిడిపి ఆఫీస్ పై వైసీపీ శ్రేణులు దాడి చేసినా చంద్రబాబు ఓర్పుతో ఉంటున్నారని, ఆయన ఒక చిటిచేస్తే వైసీపీ వాళ్లను పరిగెత్తిస్తానని లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై దాడి చేసేందుకు కూడా సిగ్గులేకుండా రాళ్లు, కత్తులు పట్టుకొని వచ్చారని ఆరోపించారు.
ఇక్కడ ఇంత ఊగుతున్న ఈ ఎస్ఐ…వారిపై నో కేస్ అంటూ లెజెండ్ సినిమాలో బాలా మామ చెప్పిన డైలాగ్ ను లోకేష్ చెప్పడంతో తెలుగు తమ్ముళ్లు చప్పట్లు కొట్టారు. అంతకుముందు, లోకేష్ పాదయాత్ర సందర్భంగా రేణిగుంట పట్టణ వీధుల్లో, బస్టాండ్ పరిసరాలలో టీడీపీ శ్రేణులు ఏర్పాటుచేసిన తోరణాలు, జెండాలు, ఫ్లెక్సీలను అధికారులు తొలగించడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.