కొద్ది రోజులుగా ఇరు తెలుగు రాష్ట్రాలు ఎడతెరపిలేని వర్షాలతో అతలాకుతలమవుతోన్న సంగతి తెలిసిందే. ఏపీలోని పలు గ్రామాలు నీటమునిగిపోగా, కొన్ని పట్టణాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో జనజీవనం అస్తవ్యస్థమైంది. మరోవైపు, వర్షాల ధాటికి వేలాది ఎకరాలు నీటమునిగి చేతికొచ్చిన పంట నోటికి అందకుండా పోవడంతో రైతన్నలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వరదబాధితులను ఓదార్చేందుకు తూర్పు గోదావరి జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ పర్యటించారు.
జగ్గంపేట, ప్రత్తిపాడు, పిఠాపురం, ఉప్పాడ కొత్తపల్లి, అనపర్తి నియోజకవర్గాల్లోని ప్రజలు, రైతులతో మాట్లాడి వారికి తానున్నానంటూ భరోసా ఇచ్చారు లోకేష్. అయితే, లోకేష్ పర్యటనలో వైసీపీ కార్యకర్తలు హల్ చల్ చేశారు. జై జగన్.. జై జై జగన్’ అంటూ నినాదాలు చేసి టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. దీంతో, పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
ఈ నేపథ్యంలో జగన్ సర్కార్ పై లోకేష్ ధ్వజమెత్తారు. వర్షాలు,వరదల వల్ల రైతులు నష్టపోతే సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పట్టించుకోవడం లేదని, హెలికాప్టర్‌పై తిరుగుతున్నారని మండిపడ్డారు. ఏపీలో వేలాది ఎకరాలు నీటమునిగినా వ్యవసాయ శాఖా మంత్రికి పట్టడం లేదని, ఆ శాఖా మంత్రి కన్నబాబు ఎక్కడ ఉన్నారని లోకేష్ ప్రశ్నించారు.
మిగతా మంత్రులు అన్నదాతలను అవమానించడంలో బిజీగా ఉన్నారని, రైతులపై శ్రద్ధ పెట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో వచ్చిన వరద వల్ల నష్టపోయిన రైతులకు ఇంకా పరిహారమే ఇవ్వలేదని, రైతు భరోసాతో రైతులను మోసం చేస్తున్నారని లోకేష్ ఆరోపించారు. వైసీపీది రైతు ప్రభుత్వం కాదని రైతులు లేని ప్రభుత్వమని లోకేష్ ఎద్దేవా చేశారు.
లోకేష్ పర్యటనకు రాష్ట్ర వ్యాప్తంగా అనూహ్య స్పందన రావడంతో సీఎం జగన్ తోపాటు వైసీపీ నేతల గుండెల్లో గుబులు మొదలైంది. మోకాలు లోతు నీళ్లలో నడుచుకుంటూ జనంతో మమేకమై వారి సమస్యలు తెలుసుకున్న లోకేష్ పై వరదబాధితులు ప్రశంసలు కురిపిస్తుండడం వైసీపీ నేతలకు మింగుడుపడడం లేదు. ఓ వైపు వైసీపీ నేతలు, మంత్రులు వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించలేదని, ఒకరిద్దరు నేతలు కంటితుడుపుచర్యగా పర్యటించారని విమర్శలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో లోకేష్….వరద నీటిని సైతం లెక్క చేయకుండా చేసిన పర్యటనతో వైసీపీ సర్కార్ డిఫెన్స్ లో పడిందన్న చర్చ జరుగుతోంది. ఇక, వరద బాధితులు, రైతుల విషయంలో జగన్ సర్కార్ తీరును లోకేష్ ఎండగట్టడంతో వైసీపీ నేతలు తలలుపట్టుకుంటున్నారన్న టాక్ వస్తోంది.
ఈ క్రమంలోనే లోకేష్ పర్యటనకు మైలేజ్ రాకూడదన్న దురుద్దేశ్యంతో పర్యటన మధ్యలో వైసీపీ కార్యకర్తలు గలాటా రేపారన్న విమర్శలు వస్తున్నాయి. ఏది ఏమైనా గ్రౌండ్ లెవల్ లో సాధారణ కార్యకర్తలాగా మారి లోకేష్ చేసిన పర్యటనతో వైసీపీ సర్కార్ ఉలిక్కిపడిందని చెప్పవచ్చు.