నెటిజన్ల సాక్షిగా జగన్ ఢిల్లీ టూర్ గుట్టురట్టు చేసిన నారా లోకేష్
ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటనపై ఇరు తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. హుటాహుటిన ఢిల్లీ వెళ్లిన జగన్….షాతో జరిగిన భేటీలో ఏం మాట్లాడారన్నదే ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.
ఏపీ హైకోర్టు జడ్జి జస్టిస్ జేకే మహేశ్వరి బదిలీ వ్యవహారంపై చర్చించేందుకు జగన్ ఢిల్లీ వెళ్లారని కొందరు అంటున్నారు. పోలవరం నిధుల గురించి మాట్లాడేందుకు వెళ్లారని వైసీపీ నేతలంటున్నారు. అయితే, ఏడాదిలోపు రాజకీయ నేతలపై ఉన్న కేసులను పరిష్కరించాలని సుప్రీం కోర్టు ఆదేశాలిచ్చిన నేపథ్యంలో జగన్ తన కేసుల గురించి చర్చించేందుకు ఢిల్లీ పెద్దల కటాక్షం కోరారని కొందరు అంటున్నారు.
ఈ నేపథ్యంలోనే జగన్ ఢిల్లీ టూర్ కు గల కారణాలపై టీడీపీ నేత నారా లోకేష్ ఓ ఆన్ లైన్ పోల్ నిర్వహించారు. తన ట్విట్టర్, ఫేస్ బుక్ ఖాతాలలో లోకేష్ నిర్వహించిన ఈ ఒపీనియన్ పోల్ కు అనూహ్య స్పందన వస్తోంది. ట్విటర్ లో ఈ ఒపీనియన్ పోల్ కు లోకేష్ మూడు ఆసక్తికర ఆప్షన్లిచ్చారు.
1.కేసుల మాఫీ కోసమా?
2.బాబాయ్ హత్య కేసు కోసమా?
3.ప్రత్యేక హోదా కోసమా?
అని లోకేష్ ఇచ్చిన 3 ఆప్షన్లపై నెటిజన్లు ఆసక్తికరంగా పోల్ చేశారు. ఢిల్లీ పర్యటన వెనుక మర్మమేంటో చెప్పాలని నెటిజన్లను కోరిన లోకేష్ కు…నెటిజన్లు ఆసక్తికరంగా సమాధానమిచ్చారు.
తనపై ఉన్న కేసుల మాఫీ కోసమే జగన్ ఢిల్లీ వెళ్లారని 69 శాతం మంది నెటిజన్లు అభిప్రాయపడ్డారు. అయితే, ప్రత్యేక హోదా కోసమని 25 శాతం మంది సమాధానాలిచ్చారు. తన బాబాయ్ వివేకా హత్య కేసుకోసం జగన్ ఢిల్లీ వెళ్లారని 6 శాతం మంది తమ అభిప్రాయాలను తెలిపారు.
బుధవారం ఉదయం తన ట్విటర్ ఖాతాలో నారా లోకేష్ పోస్ట్ చేశారు. ఇప్పటివరకు దాదాపు 5వేలకు పైగా నెటిజన్లు ఈ పోల్ లో తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. ఈ పోల్ ముగియడానికి మరో 6 రోజుల గడువుంది. మరి, ఈ ఆరు రోజుల్లో ఆ 69 శాతం ఎంతశాతానికి పెరుగుతుందో అన్నది ఆసక్తికరంగా మారింది. లోకేష్ నిర్వహించిన ఈ ఆన్ లైన్ పోల్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.