సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రకరకాల సంక్షేమ పథకాలు, నవరత్నాలు అంటూ ఖజానాను ఖాళీ చేస్తున్నారని ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ప్రజలు జగన్ ని నమ్మి ఓటు వేశారని, కానీ ఓ చేత్తో పథకాలకు డబ్బులు ఇస్తూనే మరో చేత్తో జగన్ లాక్కుంటున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. జగన్ హయాంలో ఎన్నడూ లేని విధంగా కరెంటు చార్జీలు, ఆర్టీసీ చార్జీలు పెరిగాయని పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని విమర్శలు చేస్తున్నారు. సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పిన జగన్ రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని కూడా ఏరులుగా పారిస్తున్నారని మండిపడుతున్నారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా సీఎం జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నెక్స్ట్ లెవల్ సెటైర్లు వేశారు. తాగుడు మాన్పించాలనే ఉద్దేశంతో మద్యపాన నిషేధం చేయకుండానే రేట్లు రెట్టింపు చేయడం జగన్ కే చెల్లిందని లోకేష్ ఎద్దేవా చేశారు. ఇక, ప్రజలు విద్యుత్ పొదుపుగా వాడాలని జగన్ అనుకున్నారని, అందుకే కరెంటు చార్జీలు పెంచేశారని చురకలంటించారు. జనం ఆరోగ్యంపై జగన్ కు చాలా శ్రద్ధ ఉందని, అందుకే జనం లావు కాకుండా నిత్యావసర వస్తువుల ధరలు కూడా అమాంతం పెంచేసి, వారు ఎక్కువగా తినకుండా చేశారని సెటైర్లు వేశారు.
పర్యావరణ ప్రేమికుడిగా జగన్ కు మంచి పేరుందని, అందుకే వాయు కాలుష్యం తగ్గించేందుకు పెట్రోల్, డీజిల్ ధరలు అమాంతం పెంచేసారని ఆరోపించారు. ఇక, తాను చేసిన ప్రతి దొంగ పనికి సుద్ధులు చెప్పేవాడే చంచల్ గూడ స్కూలు స్టూడెంట్ నెంబర్ 6093, బ్యాచ్ నెంబర్ 420 జగ్గడు అంటూ జగన్ పై లోకేష్ వేసిన నెక్స్ట్ లెవెల్ సెటైర్లు, పంచ్ లు, ర్యాగింగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.