టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి.. నారా లోకేష్ దూకుడు పెంచారు. ఇటీవల కాలంలో ఆయన రైతుల పక్షాన గట్టి వాయిస్ వినిపి స్తున్నారు. ఒకవైపు కరోనా తీవ్రత తగ్గకపోయినా.. సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. “ఎక్కడ సమస్య ఉంటే.. అక్కడ“ అన్నట్టుగా ఆయన వాలిపోతున్నారు. మరీ ముఖ్యంగా అకాల వర్షా లు, వరదలు, తుఫాన్ల కారణంగా నష్టపోతున్న రైతాంగానికి లోకేష్ తన పర్యటనలో భరోసా కల్పిస్తున్నారు. నేనున్నానంటూ.. ఆయన వారిలో భరోసా నింపుతున్నారు. వారి తరఫున ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. కేవలం ముక్తసరిగా కాకుండా.. మనసు పెట్టి చేస్తున్న ఈ పర్యటనలకు మంచి ఫాలోయింగ్ రావడంతోపాటు లోకేష్ విసురుతున్న విమర్శలకు సర్కారులోనూ అంతర్మ థనం జరుగుతోంది.
కొన్నాళ్ల నుంచి లోకేష్ ప్రజలతో బాగానే కనెక్ట్ అవుతున్నారనే టాక్ వినిపిస్తోంది. రైతులు, ఎస్సీ, ఎస్టీ వర్గాల వారిపై జరుగుతు న్న దాడుల విషయంలో లోకేష్ వెంటనే స్పందిస్తున్నారు. అదేసమయంలో పార్టీలోనూ నేతలపై జరుగుతున్న దాడులు, కేసులు పెడుతున్న తీరును ఆయన ఎండగడుతున్నారు. ప్రకాశం జిల్లా నుంచి గుంటూరు వరకు ఆయన ఇటీవల రైతులకు భరోసా కల్పించేందుకు పర్యటించారు. తీవ్రంగా నష్టపోయిన రైతాంగంలో ధైర్యం నూరిపోస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా కృష్ణాజిల్లాలో నివర్ తుఫాను ప్రభావిత అవనిగడ్డ నియోజకవర్గంలోని రైతులను పరామర్శించారు. ఈ సందర్భంగా లోకేష్ విసిరిసన విమర్శనాస్త్రాలు.. సర్కారుకు బాగానే గుచ్చుకున్నాయని అంటున్నారు పరిశీలకులు.
“అసెంబ్లీలో ఒకటి చెబుతారు. మండలిలో మాట మారుస్తారు. సీఎం ఒకటి అంటారు. మంత్రి మరో మాట చెబుతారు. రైతులు అంటే.. వీరికి ఆట బొమ్మల్లా కనిపిస్తున్నారు. నివర్ తుఫాన్ కారణంగా.. 20 లక్షల ఎకరాల్లో నష్టం వాటిల్లిందని సీఎం అంటారు. 17 లక్షల ఎకరాలేనని మంత్రి కన్నబాబు చెబుతారు, 12 లక్షల ఎకరాలేనని అధికారులు నివేదికలు ఇస్తారు. ఇదంతా ఏంటి? ఫేక్ కాకపోతే.. అందుకే ఆయన ఫేక్ సీఎం.. ఈ ప్రభుత్వం ఫేక్!! “ అంటూ లోకేష్ విరుచుకుపడ్డారు. అవనిగడ్డ నియోజకవ ర్గంలో తీవ్రంగా నష్టపోయిన నలుగురు రైతులు తమకు ప్రభుత్వం నుంచి సాయం అందుతుందో లేదోననే బెంగతో.. ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయా రైతు కుటుంబాలను పరామర్శించారు.
“ఊరులో ఏ పొలానికీ ఎన్యూమరేషన్ జరగలేదు. రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుందని హెచ్చరించినా.. ఈ దున్నపోతు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు“ అని లోకేష్ విరుచుకుపడ్డారు. ఆయన వెంట మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ తదితర కీలక నేతలు పాల్గొన్నారు. ఇక, జిల్లాలోకి అడుగు పెడుతున్నప్పుడే పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. పెద్ద ఎత్తున బైకు ర్యాలీతో లోకేష్‌కు జేజేల పలికాయి. మొత్తంగా చూస్తే.. లోకేష్ పర్యటన ఇటు పార్టీలోను, అటు రైతాంగంలోనూ కూడా ఆశలు చిగురింపజేసింది. రైతుల పక్షాన తాను ఇంటా బయటా పోరాడతానన్న లోకేష్‌పై అన్నదాతల్లో నమ్మకం చిగురించింది. మొత్తంగా ఇది ప్రభుత్వంలో అంతర్మథనానికి దారితీయడం గమనార్హం.