అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ లో యకహోమా గ్రూప్ 2,200 కోట్ల పెట్టుబడితో నెలకొల్పిన ‘ఏటీసీ టైర్ల ‘ పరిశ్రమను సీఎం జగన్ నిన్న ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే, తన హయాంలోనే ఏపీకి దిగ్గజ కంపెనీలు వస్తున్నాయని జగన్ చెప్పడంతో టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఉన్న కంపెనీలను తరిమేస్తున్న జగన్ ఈ వ్యాఖ్యలు చేయడంపై మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే జగన్ కు సంబంధించి టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ సంచలన ప్రకటన చేశారు.
జగన్ కు సంబంధించిన పెద్ద కుంభకోణాన్ని వచ్చే వారం బయటపెట్టబోతున్నానని లోకేష్ సంచలన ప్రకటన చేశారు. వైసీపీ హయాంలో వచ్చిన పరిశ్రమల కంటే వెళ్లిపోయిన పరిశ్రమలే ఎక్కువని దుయ్యబట్టారు. పెట్టుబడులు పెట్టాలంటే సీఎం వాటా ఎంతనేది చర్చకు వస్తోందని లోకేష్ సంచలన ఆరోపణలు చేశారు. ఏపీలో జగన్ హయాంలో వచ్చిన పరిశ్రమలపై శ్వేతపత్రం విడుదల చేస్తే చర్చకు సిద్ధమని జగన్ కు లోకేష్ సవాల్ విసిరారు.
ఈడీ, ఐటీ, సీబీఐలకు జగన్ భయపడి ఢిల్లీలో తలవంచారని, జగన్ వి టెన్త్ పాస్-డిగ్రీ ఫెయిల్ తెలివితేటలని ఎద్దేవా చేశారు. ఆ అత్తెసరు తెలివితేటలతో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమా రాదని, రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు వెళ్లిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. జగన్ టైం అయిపోయిందని, ఆయన ఇంటికెళ్లే సమయం దగ్గర పడిందని ఎద్దేవా చేశారు. జగన్ రిబ్బన్ కటింగ్ చేస్తున్న ప్రతీ పరిశ్రమా టీడీపీ ప్రభుత్వం కృషి వల్ల వచ్చిందేనని చెప్పారు.
టీడీపీ ప్రభుత్వ హయాంలో 5 లక్షల ఉద్యోగులు ఇచ్చారని జగన్ ప్రభుత్వమే ఒప్పుకుందని గుర్తు చేశారు. జగన్ ఇచ్చిన ఉద్యోగాలపై చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. వైసీపీ ఇచ్చిన దాదాపు 500 హామీల్లో మాట తప్పి మడమ తిప్పిన జగన్మోహన్ రెడ్డిని 175 నియోజకవర్గాలలో గెలిపించాలా అని ప్రశ్నించారు. ఢిల్లీలో కేంద్రం మెడలు వంచుతానన్న జగన్.. రాష్ట్రానికి ఏం సాధించారని ప్రశ్నించారు. లోకేష్ తాజా ప్రకటనతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. జగన్ కుంభకోణం ఏమయ్యుంటుందని సర్వత్రా ఉత్కంఠ ఏర్పడింది.