ఎన్నో పుకార్లు..ఊహాగానాలు..దుష్ప్రచారాల నడుమ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు ఢిల్లీలో సీఐడీ అధికారుల నుంచి 41 ఏ నోటీసులు అందుకున్నారు. తొలుత వాట్సాప్ లో లోకేష్ కు సీఐడీ అధికారులు నోటీసులు పంపగా..ఆ తర్వాత గల్లా జయదేవ్ ఇంటికి వెళ్లి స్వయంగా లోకేష్ కు నోటీసులిచ్చారు. అక్టోబరు 4వ తేదీ ఉదయం 10 గంటలకు విచారణకు రావాలని పేర్కొన్నారు. ఇక, నోటీసులు అందినట్లు సీఐడీ అధికారులకు లోకేష్ బదులిచ్చారు.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పు కేసులో లోకేష్ ను ఏ 14గా చేర్చారు. ఈ కేసులోనే లోకేష్ కు సీఆర్పీసీ 41ఏ కింద నోటీసులిచ్చి విచారణ జరపాలని హైకోర్టు ఆదేశించింది. విచారణకు సహకరించాలని లోకేష్ కు న్యాయమూర్తి ఆదేశించడంతో చట్టాలను గౌరవించి లోకేష్ సీఐడీ అధికారులకు సహకరిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ రోజు ఢిల్లీలో లోకేష్ కు సీఆర్పీసీ 41ఏ నోటీసులు ఇచ్చారు. అక్టోబర్ 4వ తేదీన విచారణ సందర్భంగా లోకేష్ ను ఏం ప్రశ్నించబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది.