సాక్షి మీడియాపై టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ మరోసారి న్యాయపోరాటం చేసేందుకు రెడీ అయ్యారు. తనపై అసత్య కథనాలు ప్రచురించిందని ఆరోపిస్తూ సాక్షి పేపర్ పై, అప్పటి స్కిల్ డెవలప్ మెంట్ విభాగం చైర్మన్ అజయ్ రెడ్డి పై మంగళగిరి మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టులో క్రిమినల్ కేసులు దాఖలు చేశారు లోకేశ్. ఈ క్రమంలోనే తన వాంగ్మూలం నమోదు చేసేందుకు శుక్రవారంనాడు కోర్టుకు హాజరు కానున్నారు. ఈ క్రమంలోనే ఆగస్టు 4వ తేదీ పాదయాత్రకు విరామం ప్రకటించారు.
ప్రస్తుతం యువగళం పాదయాత్ర వినుకొండ అసెంబ్లీ నియోజకవర్గంలో కొనసాగుతోంది. కొండ్రముట్ల వద్ద 2300 కి.మీ. మైలురాయికి పాదయాత్ర చేరుకున్న సందర్భంగా వరికపూడిశెల ప్రాజెక్టుకు హామీ ఇస్తూ శిలాఫలకాన్ని లోకేష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జగన్ పై లోకేష్ విమర్శలు గుప్పించారు. వ్యవసాయంపై అవగాహన లేని సీఎం ఉండటం వల్లే రైతులకు ఇన్ని కష్టాలు వస్తున్నాయని, కష్టకాలంలో అన్నదాతలకు అండగా నిలవాల్సిన జగన్ తాడేపల్లి ప్యాలెస్ ను వదిలి బయటకు రావడం లేదని విమర్శించారు.
టీడీపీ అధికారంలోకి వచ్చాక హార్టికల్చర్ పంటలకు రాయితీలు, మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. మరో 9 నెలలు ఓపికపడితే మీకోసం పనిచేసే చంద్రబాబు ముఖ్యమంత్రిగా వస్తారు అని చెప్పారు. వైసీపీ నాయకులకు దోచుకోవడం, దాచుకోవడం తప్ప ప్రజా సమస్యలపై శ్రద్ధలేదని దుయ్యబట్టారు. జగన్ అధికారంలోకి వచ్చాక గ్రామాలను పూర్తిగా గాలికొదిలేశారని మండిపడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు గుక్కెడు నీళ్లివ్వలేని అసమర్థుడు ముఖ్యమంత్రిగా ఉండటం రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం అని ఆవేదన వ్యక్తం చేశారు.