‘న్యాయస్థానం టు దేవస్థానం’ పేరుతో అమరావతి పరిరక్షణ సమితి నేటి నుంచి చేపట్టిన మహా పాదయాత్రకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంఘీభావం ప్రకటించారు. ఎత్తిన జెండా దించకుండా 685 రోజులుగా జై అమరావతి అంటూ నినదిస్తున్న రైతులకు, మహిళలకు, యువతకు లోకేష్ ఉద్యమాభివందనాలు తెలిపారు. ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని నినాదంతో ప్రజారాజధాని అమరావతి పరిరక్షణకు తలపెట్టిన మహా పాదయాత్ర విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని లోకేష్ అన్నారు.
ఆ శ్రీవారి ఆశీస్సులతో పాలకుల ఆలోచనధోరణిలో మార్పు వచ్చి అమరావతినే రాజధానిగా కొనసాగించాలని లోకేష్ ఆకాంక్షించారు. ఇక, ఈ మహా పాదయాత్రకు టీడీపీ సంపూర్ణ మద్దతు ఉంటుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. మహా పాదయాత్రలో టీడీపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొని రైతులకు అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. 685 రోజులుగా రైతులు ఉద్యమం చేస్తుంటే నిమ్మకు నీరెత్తినట్లు ప్రభుత్వం వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. అమరావతి సంపదను ఉపయోగించుకుంటే ఎలాంటి అప్పులు తేవాల్సిన అవసరం లేదన్నారు. రూ.2 లక్షల కోట్ల సంపదను బూడిదపాలు చేశారని మండిపడ్డారు.
ఇక, మహా పాదయాత్ర విజయవంతం కావాలని.. అమరాతి రాజధానిగా కొనసాగాలని కోరుకుంటూ.. రైతుల పాదయాత్రకు సంఘీభావం తెలుపుదామని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ పిలుపునిచ్చారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం 34 వేల ఎకరాలను రైతులు త్యాగం చేశారని ఉమ పేర్కొన్నారు. అమరావతి మహా పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు వెళుతుంటే పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకుంటున్నారన్నారని మండిపడ్డారు.