వైసీపీ అధినేత, సీఎం జగన్‌పై టీడీపీ నాయకులు విమర్శలు చేసే విషయం తెలిసిందే. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను కూడా తప్పుబడుతుంటారు. ఈ విషయంలో యువ నాయకుడు నారా లోకేష్ దూకు డుగా కూడా ఉన్నారు. అయితే.. తాజాగా ఆయన నేరుగా సీఎం జగన్ సతీమణి.. భారతీ రెడ్డిపై ఫైరయ్యారు. “ఏమ్మా.. భారతీరెడ్డీ“ అంటూ నిప్పులు చెరిగారు.
ఏంటీ వివాదం
భారతీ రెడ్డి చైర్ పర్సన్‌గా ఉన్న సాక్షి పత్రికలో ఓకథనం వచ్చింది. నారా లోకేష్ సన్నిహితుడికి సీఎం జగన్.. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో మెంబర్ పదవి ఇచ్చారని.. రాజకీయాలకు అతీతంగా టీటీడీని నిర్వహిస్తున్నారని పత్రికలో రాసుకొచ్చారు. అయితే.. ఈ విషయంపై నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు. తన సన్నిహితుడికి జగన్ పాలనలో టీటీడీ బోర్డు మెంబర్ పదవి ఇచ్చారా? అని ట్విటర్ వేదికగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రశ్నించారు.
‘ఏమ్మా భారతీ రెడ్డి గారు తప్పుడు సాక్షి పత్రిక కు సిగ్గు అనేది లేదా?’ అంటూ ఫైర్ అయ్యారు. పక్క రాష్ట్రాల్లో అక్రమాలకు పాల్పడ్డాడని అరెస్ట్ చేసిన బూదాటి లక్ష్మీనారాయణకు వైసీపీ పాలనలో టీడీపీ బోర్డు మెంబర్ పదవి ఎలా వచ్చింది? అని నారా లోకేష్ ప్రశ్నించారు. ముడుపులు అందుకోకుండానే బూదాటి లక్ష్మీనారాయణను టీటీడీ బోర్డు మెంబర్ చెయ్యాలని కరకట్ట కమల్ హాసన్ సిఫార్సు చేశారా? అని నిలదీశారు.
‘ఇక డ్రామాలు కట్టిపెట్టు కరకట్ట కమల్’(మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి) అంటూ హెచ్చరించారు. టీడీపీ మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త అబద్దయ్య మాట్లాడింది నూటికి నూరుశాతం నిజమని.. అందుకు ఆయనను తాను అభినందిస్తున్నానని నారా లోకేష్ తెలిపారు. దీనిపై సాక్షి ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.