వైసీపీ హయాంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు భూ కబ్జాలు, భూ ఆక్రమణలు, సెటిల్మెంట్లకు తెరతీశారని టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. సామాన్యులైనా…పోలీసు అధికారులైనా…వైసీపీ నేతల కన్ను పడితే కబ్జా కావాల్సిందేనని టీడీపీ నేతలు విమర్శిస్తుంటారు. ఇటీవల విశాఖలో ఓ ఎస్పీ స్థలం కబ్జా చేయడం సంచలనం రేపింది. గతంలో, చిలకలూరిపేటలో దళితుల శ్మశానం కూడా వైసీపీ నేతలు కబ్జా చేశారని ఓ రైతు ఫిర్యాదు చేయడంతో ఆఖరికి శ్మశానాలనూ వదలడం లేదని విమర్శలు వచ్చాయి.
ఈ నేపథ్యంలోనే తాజాగా వైసీపీ నేతలు కబ్జాల పర్వం కర్నూలు జిల్లాకు చేరింది. కోర్టులో కేసు నడుస్తున్న 8 ఎకరాల భూమిని వైసీపీ ఎమ్మెల్యే బినామీ కబ్జా చేశారన్న ఆరోపణలు సంచలనం రేపాయి. ఈ నేపథ్యంలో ఆ ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రంగా స్పందించారు. వివాదంలో ఉన్న 8.25 ఎకరాల తమ కుటుంబ ఆస్తిని కర్నూలు జిల్లా పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి బినామీ అటికెలగుండు బాబిరెడ్డి కబ్జా చేశారని మురళీమోహన్గౌడ్, జయదేవి దంపతులు కర్నూలు కలెక్టరేట్ వద్ద నిరసనకు దిగారని లోకేశ్ వెల్లడించారు..
ఆ భూమికి సంబంధించిన వివాదం ప్రస్తుతం కోర్టులో ఉందని, కానీ, బాబిరెడ్డి తనపేరుతో ఆ భూమి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని తెలుస్తోందని లోకేశ్ ఫైర్ అయ్యారు. ఆ భూమిలో నిర్మాణాలను సైతం మొదలెట్టేశారని తెలుస్తోందని, ఇదేంటని నిలదీసిన మురళీమోహన్గౌడ్, జయదేవిలను చంపుతానంటూ బాబిరెడ్డి బెదిరించినట్లు తెలిసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని ఆ వృద్ధ దంపతులు ప్లకార్డులపై రాసుకుని మరీ నిరసనకు దిగారంటే వైసీపీ నేతల కబ్జాలు ఏ రేంజ్ లో ఉన్నాయో తెలుస్తోందని చెప్పారు.
ఆ భూమిని కబ్జా చేయడం ఓ తప్పని, అందులో నిర్మాణాలకి దౌర్జన్యంగా దిగడం దారుణమని లోకేశ్ ధ్వజమెత్తారు. ఆ వృద్ధుల్ని చంపుతామని బెదిరించడం వైసీపీ కబ్జాకోరుల అరాచకాలకి పరాకాష్ఠ అని, ఆ వృద్ధులకి పోలీసులు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. అంతేకాదు, కోర్టు వివాదంలో ఉన్న భూమిని కబ్జాచేసిన బాబిరెడ్డిపై కేసు నమోదు చేయాలని లోకేశ్ డిమాండ్ చేశారు.