తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర నెల్లూరు జిల్లాలో నాలుగో రోజు కొనసాగుతోంది. జిల్లాలోని అనంతసాగరంలో బహిరంగ సభ ఏర్పాటు చేయగా.. వేలాదిగా ప్రజలు తరలి వచ్చారు. యువగళం.. మనగళం.. ప్రజాబలం అంటూ లోకేష్ ప్రసంగం ప్రారంభించి.. జగన్‌పై విమర్శలు గుప్పించారు. ప్రసంగం ప్రారంభం కాగానే ఈలలు చప్పట్లతో మారుమోగింది.
రాయలసీమ జిల్లాల్లో నేను అడుగుపెట్టిన తరువాత వైసీపీ నేతలు గజగజా వణికారనీ అలానే నెల్లూరు జిల్లాలో అడుగు పెట్టక ముందే వైసీపీ నేతలు ప్యాంట్లు తడుపుకున్నారు అని లోకేష్ ఎద్దేవా చేశారు. సింహపురి నుంచే మార్పు మొదలైంది.. జగన్ పనైపోయిందని వ్యాఖ్యానించారు. యువగళాన్ని అడ్డుకోవడానికి జగన్ అడ్డదారులు తొక్కాడు. జిఓ నెం 1 తెచ్చాడు.. మడిచి ఎక్కడ పెట్టుకుంటావో పెట్టుకో అని చెప్పా.. తగ్గేదే లేదని లోకేష్ అన్నారు.
యువగళానికి వస్తున్న జనాన్ని చూసి జగన్‌కి ఫ్రస్ట్రేషన్ వచ్చిందని నారా లోకేష్ అన్నారు. “నాలుగు టీవీలు పగలగొట్టాడు. ఇక ఏమీ చెయ్యలేక కోడికత్తి బ్యాచ్‌ని పంపి కోడిగుడ్డు వేయించాడు“ అని ఎద్దేవా చేశారు. క్లైమోర్మైన్లకే భయపడని కుటుంబం మాది.. కోడికత్తి బ్యాచ్‌కి భయపడతామా.. అని లోకేష్ ధ్వజమెత్తారు. జగన్ ఒక ఫెయిల్డ్ సీఎం అని లోకేశ్ విమర్శించారు. చంద్రబాబు కట్టిన సచివాలయంలో కూర్చోవడం.. చేతగాని వాళ్లు మూడు రాజధానులు కడతాం అని బిల్డప్ ఇచ్చారు. జగన్ రెడ్డి విశాఖను క్రైం క్యాపిటల్ చేసాడని అమిత్‌షా అన్నారు.. దీంతో మంత్రులంతా మూకుమ్మడిగా రోడ్డు మీదకి వచ్చి మొరిగారని విమర్శించారు.
“జగన్‌ది కన్నింగ్ బుద్ది అనడంలో ఎలాంటి సందేహం లేదు.. ఎందుకంటే.. తల్లి, చెల్లితో పాటు నమ్మి ఓటేసిన అందరిని మోసం చేసాడు. అందుకే కన్నింగ్ జగన్ రెడ్డి అని పేరు పెట్టా“ అని నారా లోకేష్ అన్నారు. కన్నింగ్ జగన్‌కి ఒక వ్యాధి ఉంది.. అది మైథోమానియా సిండ్రోమ్ ఈ వ్యాధితో జగన్ బాధపడుతున్నాడని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పాత పథకాలు అమలు చెయ్యడంతో పాటు, ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తాం.. దీనిపై రెడ్డి సోదరులు కూడా ఆలోచించాలని అన్నారు.