తెలుగు వారి ఆత్మగౌరవాన్ని దేశం నలుమూలలా వినిపించిన విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడు.. ఎన్టీఆర్ అంటే.. ఇప్పటికీ ప్రజలకు అభిమానమే. ఆయన మన మధ్య లేకు న్నా.. ఆయన తీసుకున్న నిర్ణయాలు, వేసిన బాట ఇప్పటికీ పార్టీలకు అతీతంగా అందరూ ఆదరించేదే. అనుసరించేదే కూడా. అయితే, ఎన్నికల వేళ.. ఏపీలో ఎన్టీఆర్ విగ్రహాల విధ్వంసం తెరమీదికి వచ్చింది.
ఉమ్మడి గుంటూరులోని బాపట్ల మండలం, భర్తీపూడిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని కొందరు దుండగులు కూల్చేశారు. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత.. కొందరు విగ్రహం తల భాగాన్ని నరికేసి.. ధ్వంసంచేశారు. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా కలకలం రేగింది. బాపట్లలో టీడీపీ పుంజుకుని.. వైసీపీకి చెక్ పెడుతున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ ఘటన సంచలనంగా మారింది.
ఈ ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. అర్ధరాత్రి సమయంలో వెళ్లి ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం సిగ్గుమాలిన చర్య అని అన్నారు. మహనీయుల పట్ల అగౌరవంగా వ్యవహరించడం వైసీపీ అహంకారానికి నిదర్శనమని, బాధ్యులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. మరోవైపు నారా లోకేష్ కూడా ఈ ఘటనను ఖండించారు. ఓటమి భయంతో వైసీపీ నాయకులు దుండగుల వేషంలో వచ్చి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.
తెలుగు ప్రజల గుండెల్లో కొలువైన ఎన్టీఆర్ స్థానాన్ని విగ్రహాల కూల్చివేతతో చెరిపేయలేరన్నారు. 3 నెలల్లో కూల్చివేసిన వారితోనే అదే స్థానంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని మళ్లీ పెట్టిస్తామని లోకేష్ శపథం చేశారు. ఈ ఘటనపై స్థానిక టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిరసనకు పిలుపునిచ్చారు. అయితే, పోలీసులు వారిని అడ్డుకోవడంతో ప్రస్తుతం ఉద్రిక్తంగా మారింది.