టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రపై మంత్రి రోజా సహా వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్న సంగతిత తెలిసిందే. లోకేష్ పాదయాత్రకు అడుగడుగునా పోలీసుల సాయంతో అడ్డంకులు సృష్టించేందుకు అధికార పార్టీ నేతలు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న లోకేష్…మంత్రి రోజాపై సంచలన విమర్శలు గుప్పించారు.
రోజా సొంత ఇలాకాలోనే ఆమె పరువు తీసేలా లోకేష్ సెటైర్లు వేశారు. నగరిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించిన లోకేష్…నగరిలో జబర్దస్త్ ఆంటీ గెలిచిందని పరోక్షంగా రోజాపై పంచ్ లు వేశారు. కానీ, రాబోయే ఎన్నికల్లో నగరిలో టీడీపీ జెండా ఎగరాలని, అంతా కలసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. నగరిలో టీడీపీ తరఫున భాను బరిలోకి దిగబోతున్నాడని, మంచి మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపించాలని నగరి ప్రజలకు పిలుపునిచ్చారు.
చిత్తూరులో అవినీతికి కేరాఫ్ అడ్రస్ పెద్దిరెడ్డి అని, కానీ, ఈ జిల్లాలో ఆయనకు పోటాపోటీగా నగరి ఎమ్మెల్యే, డైమండ్ పాప రోజా అవినీతి చేస్తోందని షాకింగ్ కామెంట్లు చేవారు. తనను పాపా అంటాడా అని మొన్న రోజా బాగా ఫీలైందని, అమ్మా క్షమించండి… మీ కోరిక మేరకు మిమ్మల్ని జబర్దస్త్ ఆంటీ అని పిలుస్తానని లోొకేష్ సెటైర్లు వేశారు. జబర్దస్త్ ఆంటీ డైరెక్షన్ లో గ్రావెల్ ను యమాస్పీడుగా తవ్వేస్తున్నారని, రోజుకు 150 టిప్పర్లు తమిళనాడుకు వెళుతున్నాయని లోకేష్…రోజా గుట్టురట్టు చేశారు.
వడమాలపేట మండలం కాయం రెవెన్యూ పరిధిలో పేదల పట్టాభూముల్లో జబర్దస్ద్ ఆంటీ తవ్వకాలు జరుపుతోందని దుయ్యబట్టారు. వడమాలపేట మండలం పాదిరేడులో టీటీడీ ఉద్యోగులకు 400 ఎకరాలు సేకరించి ఇళ్లు కట్టిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని, అక్కడ దళితుల భూములున్నాయని చెప్పారు. అయితే, రూ.20 లక్షలు ఇస్తాను… దాంట్లో నాకు 20 శాతం ఇవ్వండి అని ఈ జబర్దస్త్ ఆంటీ డీల్ మాట్లాడుతోందని ఎద్దేవా చేశారు.
కొసలనగరంలో 35 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసిందని, వడమాలపేట టోల్ గేటు వద్ద 55 ఎకరాల ప్రభుత్వ భూమి గోవిందా గోవిందా అని ఎద్దేవా చేశారు. వైజాగ్ లో రుషికొండ వద్ద కూడా ఒక ఎకరం స్వాహా అని పంచ్ లు వేశారు. నగరిలో చేనేత కార్మికులకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్ హామీపై జబర్దస్త్ ఆంటీ మాట్లాడడం లేదని పంచ్ వేశారు. రోజా ఎమ్మెల్యే అయిన వెంటనే గ్రానైట్ కంపెనీలకు, క్వారీలకు ఫోన్ చేసిందని, ఆమె దెబ్బకు తట్టుకోలేక వారు పరారయ్యారని చురకలంటించారు.
నగరి నియోజకవర్గాన్ని కేకు ముక్కల్లా కోసి కుటుంబ సభ్యులకు, సొంత బంధువులకు పంచిపెట్టిందని దుయ్యబట్టారు. అన్న రాంప్రసాద్ రెడ్డికి వడమాలపేట, నిండ్ర, పుత్తూరులను ఇచ్చేసిందని, విజయపురం మండలాన్ని కుమారస్వామికి, నగరి మండలాన్ని భర్త సెల్వమణి తమ్ముడికి పంచిపెట్టిందని రోజాపై విమర్శలు గుప్పించారు. నగరికి ఐదుగురు ఎమ్మెల్యేలని, వీరంతా రాత్రి జబర్దస్త్ ఆంటీతో కూర్చుని దోచుకున్న సొమ్ము లెక్కలేసుకుంటారని సంచలన ఆరోపణలు చేశారు.