ప్రభుత్వ ఉపాధ్యాయులను జగన్ సర్కార్ చేయకూడని పనులు చేయించేందుకు వాడుకుంటోందని తీవ్ర ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. మద్యం షాపుల ముందు డ్యూటీలు, మరుగుదొడ్ల శుభ్రత ఫొటోలు తీయడం వంటి టాస్క్ లు టీచర్లకు అప్పగించడంతో దుమారం రేగింది.
ఈ నేపథ్యంలో తమ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు రావడంతో జగన్ సర్కార్ చేసిన తప్పును సరిదిద్దుకునే ప్రయత్నాలు మొదలెట్టింది.
ఈ క్రమంలోనే విద్యా శాఖ పరిధి కింద పనిచేస్తున్న ఉపాధ్యాయులకు బోధనేతర బాధ్యతలను ఇవ్వకూడదని వైసీపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉపాధ్యాయులను బోధనేతర విధుల నుంచి తప్పిస్తున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఏపీ కేబినెట్ ఆమోదం లభించిన వెంటనే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ను పాఠశాల విద్యా శాఖ వెలువరించింది. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే టీచర్లను బోధనేతర కార్యకలాపాలకు వినియోగిస్తామని ఆ నోటిఫికేషన్ లో ప్రభుత్వం పేర్కొంది.
ఈ నేపథ్యంలో ఈ వ్యవహారం పై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. దురాలోచనతోనే వైసిపి ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్ తేబోతోందని లోకేష్ మండిపడ్డారు. టీచర్ల బోధనేతర పనుల్లో ఎన్నికల విధులు మాత్రమే ఉన్నాయా? అని లోకేష్ నిలదీశారు. ప్రభుత్వ ఉపాధ్యాయులతో చేయించరాని పనులను జగన్ చేయించారని వాటి సంగతేమిటని జగన్ ను ప్రశ్నించారు. ఎన్నికల విధులకు పనికిరాని టీచర్లు మద్యం షాపుల ముందు కాపలా కాసేందుకు, మరుగుదొడ్ల ఫోటోలు తీసేందుకు, సీఎం టూర్ బస్సులకు కాపలా కాసేందుకు పనికొస్తారా అంటూ లోకేష్ విరుచుకుపడ్డారు.
రాబోయే ఎన్నికల విధుల్లో టీచర్లు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది అన్న సంగతి అందరికీ తెలిసిందే. కొద్ది రోజులుగా సిపిఎఫ్ రద్దు వ్యవహారంలో టీచర్లు వర్సెస్ జగన్ సర్కార్ అన్న రీతిలో ఆందోళన జరిగిన సంగతి కూడా తెలిసిందే. దీంతో, రాబోయే ఎన్నికల్లో టీచర్లు ఎన్నికల విధులు నిర్వహిస్తే తమకు ఇబ్బంది తప్పదని భావించిన జగన్ సర్కార్ ముందుగానే ఈ కుట్రపూరితమైన ఆర్డినెన్స్ తెచ్చిందని విమర్శలు వస్తున్నాయి.