ఏపీీ సీఎం జగన్ పాలన బ్రహ్మాండం అని, జగన్ సీఎంగా ఉండబట్టే రాష్ట్రం ఈ మాత్రం అభివృద్ధి సాధించిందని వైసీపీ నేతలు డప్పు కొట్టుకుంటున్న సంగతి తెలిసిందే. గత ప్రభుత్వంలో చంద్రబాబు అనేక పొరపాట్లు చేశారని, వాటి మూల్యాన్ని జగన్ చెల్లిస్తూ ఆ తప్పుల భారాన్ని ఏసు ప్రభువు తరహాలో జగన్ మోస్తున్నారని చెబుతున్న వైనం సామాన్య పౌరులకు సైతం విస్మయం కలిగించకమానదు. ఈ నేపథ్యంలోనే తాజాగా జగన్, వైసీపీ నేతలకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అదిరిపోయే పంచ్ ఇచ్చారు.
ఏపీలో జరిగే ప్రతి విషయానికి చంద్రబాబుగారిని బాధ్యుడిని చేయడం వైసీపీ నేతలకు అలవాటైందని, వారికి పుట్టిన పిల్లలు, వారు సంపాదించిన అక్రమాస్తులు తప్ప మిగతావాటికి చంద్రబాబే కారణం అంటున్నారని లోకేశ్ సెటైర్లు వేశారు. మంత్రుల నుండి ముఖ్యమంత్రి వరకూ, ఎమ్మెల్యేల నుంచి సలహాదారుల వరకూ ఈ రెండు విషయాలకు మాత్రమే చంద్రబాబు కారణం కాదన్న భావనలో వైసీపీనేతలున్నారని చురకలంటించారు.
జగన్ రెడ్డి పెంచిన పన్నులతో పెట్రోల్,డీజిల్ ధరలు సెంచరీ దాటేశాయని, ఈ విషయంలో దక్షిణ భారత దేశంలో ఏపీ టాప్ అని ఎద్దేవా చేశారు.
2018లో పెట్రోల్,డీజిల్ పై అదనపు వ్యాట్ ని రూ.4 నుంచి రూ.2కి తగ్గించిన ఘనత చంద్రబాబు గారిదని, 31 శాతం వ్యాట్+లీటరుకి రూ.4 అదనపు వ్యాట్+లీటరుకి 1రూపాయి రోడ్డు అభివృద్ధి సుంకం వేసి లీటర్ పెట్రోల్ కి రూ.30 భారం సామాన్యులపై మోపిన దరిద్రపు చరిత్ర జగన్రెడ్డిదని దుయ్యబట్టారు.
ఆత్మలతో మాట్లాడుతున్న లండన్ పిచ్చిరెడ్డి గారి పిచ్చి ఏమైనా సజ్జలకు అంటుకుందేమోనని లోకేశ్ అనుమానం వ్యక్తం చేశారు. సజ్జల బాబుగారి జపం చేస్తున్నారని, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ బంకుల్లో పెట్రోల్, డీజిల్ రేట్లు సజ్జల ఓసారి చూడాలని, ఏపీ కంటే అక్కడ తక్కువ ధరల బోర్డులు చూసైనా చంద్రబాబు గారిపై ఏడుపు ఆపాలని సజ్జలకు లోకేశ్ కౌంటరిచ్చారు. ప్రస్తుతం లోకేశ్ వ్యాఖ్యలకు ఏం సమాధానం చెప్పాలో తెలియక వైసీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు.