ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును వైఎస్సార్ హెల్త్ వర్సిటీగా మార్చడంపై టీడీపీ నేతలతోపాటు వామపక్ష, బీజేపీ, జనసేన నేతలు కూడా మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నిప్పులు చెరిగారు. తెలుగు జాతి మొత్తం బాధపడే నిర్ణయాన్ని జగన్ తీసుకున్నారని లోకేశ్ ఫైర్ అయ్యారు. ఆ యూనివర్సిటీ పేరులోనుంచి ఎన్టీఆర్ పేరు తీసేయడాన్ని కొందరు వైసీపీ నేతలు కూడా ఇష్టపడడంలేదని చెప్పారు.
ఏ ఆత్మతో మాట్లాడి జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారో తెలియదంటూ చురకలంటించారు. తాము అధికారంలోకి వచ్చాక ఇదే రీతిలో అన్ని పేర్లు మార్చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించుకోవాలని హెచ్చరించారు. రాష్ట్రాలకు కూడా పేర్లు మార్చుకుంటూ పోతే ఎలా ఉంటుందోనని ఎద్దేవా చేశారు. మోదీ గారు రెండుసార్లు ప్రధాని అయినా…ఢిల్లీలో ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు పేరును తొలగించలేదని గుర్తు చేశారు.
టీడీపీకి భయపడి ఐదు రోజులే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించిన వైసీపీ సభ్యులు పిరికివాళ్లని, ఈ సైకో తమను తట్టుకోలేకపోయాడని జగన్ ను ఉద్దేశించి లోకేశ్ ఎద్దేవా చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక హెల్త్ యూనివర్సిటీకి మళ్లీ ఎన్టీఆర్ పేరే పెడతామని లోకేశ్ తేల్చి చెప్పారు. 1998లో చంద్రబాబు పెట్టిన పేరని, ఆ రోజుల్లోనే జిల్లాకొక మెడికల్ కాలేజీ వచ్చిందని గుర్తు చేశారు.
ఈ వ్యవహారంపై బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ మండిపడ్డారు. తెలుగువారి ఆరాధ్య దైవం ఎన్టీఆర్ పేరును తొలగించడం అత్యంత సిగ్గుచేటని అన్నారు. వైసీపీ ప్రభుత్వానికి పోయే కాలం దాపురించిందని, ప్రభుత్వం మారిన వెంటనే ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ పేరును పెట్టి తీరుతామని చెప్పారు.
రాజకీయ దురుద్దేశాలతోనే వైసీపీ సర్కారు ఈ నిర్ణయం తీసుకుందని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. రాజకీయాలకు అతీతంగా స్వర్గీయ నందమూరి తారక రామారావును అభిమానించే వ్యక్తులు రాష్ట్రవ్యాప్తంగా అనేక మంది ఉన్నారని సోము గుర్తు చేశారు. వ్యక్తుల పేరును మార్చగలరు కానీ చరిత్రను కాదని ఆయన చురకలంటించారు.
పదేపదే పలు అంశాలను వివాదాస్పదం చేయడం జగన్ కు అలవాటుగా మారిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడం తప్పని, ఇది తుగ్లక్ చర్యేనని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో జగన్ కక్షపూరిత పాలన సాగిస్తున్నారని విమర్శించారు.జగన్ కొత్తగా ఒక యూనివర్సిటీని కూడా స్థాపించలేదని, ఆయనకు చిత్తశుద్ధి ఉంటే విశ్వవిద్యాలయాల్లో సిబ్బంది భర్తీపై దృష్టి సారించాలని చురకలంటించారు.