ఏపీ అధికార పార్టీ వైసీపీపై టీడీపీ యువనాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “ప్రస్తుతం యాత్ర 2 పేరుతో ఈ సైకో జగన్ సినిమా తీశాడు. ఆ యాత్ర ఆయనకు ఆయన పార్టీకి కూడా అంతిమ యాత్రే“ అని అన్నారు. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా.. శ్రీకాకుళంలో సభలు నిర్వహిస్తున్న టీడీపీ యువ నాయకుడు.. తాజాగా వైసీపీ నేత రెడ్డి శాంతి నియోజకవర్గం పాతపట్నంలో శంఖారావం సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తనదైన శైలిలో లోకేష్ విమర్శలు గుప్పించారు.
సీఎం జగన్ ఎక్కడ నోరు విప్పినా.. అలవోకగా అబద్ధాలు వస్తాయని విమర్శించారు. “రోజుకో మోసం, పూటకో అబద్ధం అనేలా ఆయన పాలన సాగుతోంది. ఎన్నికల ముందు జగన్ తీయని మాటలు చెప్పాడు. అధికారంలోకి రాగానే అన్నీ మర్చిపోయాడు. రెండు నెలలు ఓపిక పట్టండి. టీడీపీ-జనసేన అధికారం లోకి వచ్చేస్తోంది“ అనినారా లోకేష్ అన్నారు. అదేసమయంలో సీఎం జగన్ చెప్పే మాటలు విని.. జాలి పడొద్దని నారా లోకేష్ పిలుపునిచ్చారు.
“ఈ మధ్య జగన్.. మీ బిడ్డ.. మీ బిడ్డ.. అని అంటున్నాడు. మిమ్మల్ని.. ఏదో లోకంలోకి తీసుకు వెళ్లి.. మీ మనసు కరిగేలా వ్యవహరిస్తున్నాడు. ఆయన దొంగ మాటలు విని.. జాలి చూపిస్తే.. మొత్తానికి గుండు కొట్టేస్తాడు“ అని వ్యాఖ్యానించారు. పొరపాటున జగన్ ఎన్నికల్లో గెలిస్తే మీ బిడ్డనే కదా.. మీ భూమి తీసుకుంటాని అన్నా ఏమీ చేయలేరని అన్నారు. ‘‘కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి యాత్ర-2 సినిమా తీశారు. అది వైసీపీకి అంతిమయాత్రగా మారింది. డబ్బులిచ్చి సినిమాకు వెళ్లమన్నా.. ఎవరూ పోవడం లేదు.“ అని నారా లోకేష్ ఎద్దేవా చేశారు.
జగన్ ను చూస్తే కోడికత్తి.. చంద్రబాబును చూస్తే కియా కారు గుర్తొస్తాయని నారా లోకేష్ చెప్పారు. జగన్ ప్రిజనరీ.. చంద్రబాబు విజనరీ అని నినదించారు. చంద్రబాబును అరెస్టు చేస్తే పార్టీ కార్యకర్తలు భయపడతారని అనుకున్నారని, కేసులకు భయపడేది లేదని జగన్ గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో జనసేన-టీడీపీ తరఫున పోటీ చేసే అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.