టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన శంఖారావం యాత్రకు ప్రజల నుంచి విపరీతమైన స్పందన వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గంలో జరిగిన శంఖారావం సభలో వైసీపీ, సీఎం జగన్ లపై లోకేష్ సెటైర్లు వేశారు. శంఖారావం సభకు వైసీపీ దిష్టి తగిలినట్లనిపిస్తోందని, మొదటిసారి సభలో జనరేటర్ కాలిపోయిందని అన్నారు. ఇక, యాత్ర-2 చిత్రంలో జగన్ నటించి ఉంటే హిట్ అయ్యి ఉండేదేమోనని విమర్శనాస్త్రాలు సంధించారు.
జగన్ కు కొద్దిరోజులుగా సినిమా పిచ్చి ఎక్కువైందని, అయితే తన వంకర నవ్వుతో సినిమాల్లో జగన్ నటించలేరని, కాబట్టే యాత్ర-2, వ్యూహం, శపథం వంటి సినిమాలతో తన రేంజ్ పెంచుకునే ప్రయత్నాలు చేశారని జగన్ పై లోకేష్ సంచలన ఆరోపణలు చేశారు. యాత్ర-2 చిత్రం అట్టర్ ఫ్లాప్ కన్నా దారుణమైన ఫ్లాప్ అయిందని, ఇంత దరిద్రపుగొట్టు సినిమాకు వెళ్ళబోమని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయంటే సినిమా ఎంత ఫ్లాప్ అనేది అర్థమవుతుందని అన్నారు. ఇక, ఆ సినిమా తీసి నష్టపోయిన నిర్మాత సాయం అడిగేందుకు జగన్ దగ్గరకు వెళ్ళాడని, తర్వాత జగన్ ‘అంతిమయాత్ర’ సినిమా తీస్తానని హెచ్చరించడంతో ఆయనకు జగన్ హార్సిలీ హిల్స్ లో ఖరీదైన రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించారని ఆరోపించారు.
దానికి బదులు ఇడుపులపాయలలో 2 ఎకరాల భూమో లేకపోతే జగన్ సొంత ఇల్లో ఇస్తే బాగుండేది కదా అని చురకలంటించారు. వైవీ సుబ్బారెడ్డి, బొత్స, విజయసాయిల కుటుంబాలకు జగన్ లైసెన్స్ ఇచ్చేసాడని, భూమి కనిపిస్తే చాలు కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. జగన్ రెడ్డి అవినీతి కేసుల్లో ఏ2గా ఉన్న విజయసాయి జగన్ చేసిన అవినీతి లెక్కలన్నీ పుస్తకంలో రాసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. సామాజిక బస్సుయాత్ర చేస్తున్న వైసీపీలోనే సామాజిక న్యాయం లేదని విమర్శించారు.
ఇప్పటివరకు 63 మంది ఎమ్మెల్యేలను, 16 మంది ఎంపీలను జగన్ ట్రాన్స్ ఫర్ చేశాడని, వారిలో 90 శాతం మంది బీసీ, ఎస్సీలే ఉన్నారని గుర్తు చేశారు. వైసీపీకి చెందిన బీసీ నాయకుడు జంగా కృష్ణమూర్తి బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారని, తనకు తగిన గౌరవం ఇవ్వడం లేదని ఆరోపించారని తెలిపారు.