టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వైసీపీ సర్కారు పై తీవ్ర విమర్శలు చేశారు. ప్రస్తుతం కడప జిల్లాలో పర్యటిస్తున్న ఆయన పార్టీ కార్యకర్తలను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదని, రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారని విరుచుకుపడ్డారు. జగన్ రెడ్డి ప్యాలస్ పిల్లి అని అభివర్ణించారు. ప్యాలస్ పిల్లి కి టిడిపి నాయకుల్ని చూస్తే భయం వేస్తోందని ఎద్దేవా చేశారు. టిడిపి నాయకులు బయట తిరిగితే ప్యాలస్ పిల్లి కి వణుకని అన్నారు.
“టీడిపి కార్యకర్త ట్వీట్ పెడితే ప్యాలస్ పిల్లి కి తడిచిపోతుంది. ప్రజా సమస్యల పై పోరాడినా, ప్రశ్నించినా టిడిపి నాయకుల్ని, కార్యకర్తల్ని అరెస్ట్ చేసి, అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. పోలీసులు ఇండియన్ పీనల్ కోడ్ మర్చిపోయారు… జగన్ పీనల్ కోడ్ అమలు చేస్తున్నారు. జగన్ రెడ్డి పాలనలో రివర్స్ పోలీసింగ్ నడుస్తోంది. బాధితులపైనే కేసులు పెడతారు…అది జగన్ రెడ్డి రివర్స్ పోలీసింగ్ స్పెషల్. 60 మంది ముఖ్యనాయకులు, 5 వేల మంది కార్యకర్తల పై అక్రమ కేసులు పెట్టారు. 70 మంది తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల్ని హత్య చేసారు“ అని లోకేష్ ఫైరయ్యారు.
వివేకా కుటుంబానికి న్యాయం చెయ్యమని మాట్లాడినందుకు బిటెక్ రవి పై పెట్టిన కేసులకు లెక్కే లేదని లోకేష్ వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ టెర్రరిస్ట్ రేంజ్ లో రన్ వే పై అరెస్ట్ చేస్తారని అన్నారు. “ప్రొద్దుటూరు టిడిపి ఇంఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి చేసిన తప్పేంటి? ఆయన్ని ఎందుకు అరెస్ట్ చేసారు? వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి అరాచకాలకు వ్యతిరేకంగా పోరాడటమే ప్రవీణ్ చేసిన తప్పా?“ అని ప్రశ్నించారు.
కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం పోరాడిన వ్యక్తి ప్రవీణ్ రెడ్డి. అని పేర్కొన్నారు. ప్రవీణ్ ఇంటిపై దాడి చేసింది వైసిపి రౌడీలు, రాళ్లు వేసింది వైసిపి రౌడీలని, కానీ, పోలీసులు అరెస్ట్ చేసింది మాత్రం ప్రవీణ్ కుమార్ రెడ్డినని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రవీణ్ కుమార్ రెడ్డి, టిడిపి నాయకులపై పెట్టిన అక్రమ కేసులు వెంటనే ఉపసంహరించుకోవాలని లోకేష్ డిమాండ్ చేశారు.
“ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి కాదు రాచమల్లు బెట్టింగ్ రెడ్డి. నియోజకవర్గంలో భారీగా ఇసుక దోపిడీ చేస్తున్నారు. ప్రొద్దుటూరు కేంద్రంగా నడుస్తున్న క్రికెట్ బెట్టింగ్ మాఫియాకి రాచమల్లు బెట్టింగ్ రెడ్డి డాన్. బెట్టింగ్ దందా నిర్వహించే వాళ్ళ నుండి కోట్ల రూపాయిల షేర్ ఎమ్మెల్యే కి వెళ్తుంది. బావమరిది బంగారురెడ్డి తో కలిసి భారీ దందాలు చేస్తున్నారు. దందాలు, సెటిల్ మెంట్లకు పోలీసులను వాడుకుంటున్నారు. రెండేళ్ల కిందట ప్రొద్దుటూరు టిడిపి నేత నందం సుబ్బయ్యను హత్య చేసిన కేసులో ఎమ్మెల్యే ఆయన బావమరిదిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఇంతవరకు కేసు నమోదు చేయలేదు“ అని అన్నారు.