సీఎం జగన్ హయాంలో టీడీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలు, వేధింపులు, అక్రమ కేసులు ఎక్కువయ్యాయని విపక్ష నేతలు విమర్శిస్తోన్న సంగతి తెలిసిందే. ఏపీలో జగన్ పులివెందుల పంచాయతీలు మొదలుపెట్టారని, రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారని టీడీపీ నేతలు పలుమార్లు విమర్శించారు. జగన్ ను, ప్రభుత్వ అపరిపక్వ విధానాలను ప్రశ్నించినవారిపై కేసులు పెట్టడం జగన్ పాలనలో ఆనవాయితీగా మారింది.
ఈ క్రమంలోనే మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్‌పై కేసు నమోదైంది. రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిపై ట్విటర్లో లోకేశ్ ఆరోపణలు చేసిన నేపథ్యంలో వైసీపీ ఎస్టీ సెల్ నేత భోజరాజు నాయక్ ఫిర్యాదు ప్రకారం కేసు నమోదు చేశామని పోలీసులు చెబుతున్నారు. టీడీపీ కార్యకర్తపై వేరెవరో దాడిచేస్తే ఆ నిందను ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిపై వేశారని ఫిర్యాదు చేశారు.
ఈ క్రమంలో జగన్ రెడ్డిపై లోకేశ్ నిప్పులు చెరిగారు. జగన్ అధికారంలోకి వచ్చింది ప్రజల్ని రక్షించడానికా? ప్రతిపక్ష నేతలపై కక్ష తీర్చుకునేందుకా? అని లోకేశ్ నిలదీశారు. అధికారం ఉంది కదా అని అక్రమకేసులతో ప్రతిపక్షాన్ని బెదిరించి, భయపెట్టాలనుకుంటున్నావని, టీడీపీ అధ్యక్షుడి నుంచి అభిమాని వరకు, కార్యదర్శి నుంచి కార్యకర్త వరకు ఎవరూ కేసులకు భయపడరని లోకేశ్ స్పష్టం చేశారు.
జగన్ హింసించే పులకేశి రెడ్డీ అని, తనపై ఇంకా ఎన్ని అక్రమ కేసులు పెట్టినా తాను ప్రజలపక్షాన పోరాడేందుకు సిద్ధమేనని లోకేశ్ అన్నారు. టీడీపీ కార్యకర్త మారుతిపై హత్యాయత్నానికి పాల్పడిన వైసీపీ నేతలను ప్రశ్నించినందుకే తనపై వైసీపీ పోలీసులు కేసు నమోదు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో దాడులకు పాల్పడుతున్న వైసీపీ వారిపై కేసులు ఎందుకు నమోదు చేయరని లోకేశ్ ప్రశ్నించారు.