భీమవరం నియోజకవర్గంలోని తాడేరు వద్ద యువగళం పాదయాత్ర సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన సంగతి తెలిసిందే. లోకేష్ పాదయాత్ర కాన్వాయ్ పై వైసీపీ శ్రేణులు రాళ్ల దాడికి తెగబడటంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. ఆ రాళ్ల దాడిలో యువగళం కాన్వాయ్ లోని పలు వాహనాలు తీవ్రంగా ధ్వంసం అయ్యాయి. ఆ దాడి ఘటనలో వైసీపీ కార్యకర్తలకు పోలీసులు అండగా ఉన్నారని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. అయితే, ఆ ఘటన జరిగిన తర్వాత మంగళవారం అర్ధరాత్రి యువగళం క్యాంప్ సైట్ కి వచ్చి నిద్రిస్తున్న వాలంటీర్లు, కిచెన్ సిబ్బంది సహా మొత్తం 50 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మూడు వాహనాల్లో వచ్చిన పోలీసులు వారిని తీసుకొని రాత్రంతా వివిధ పోలీస్ స్టేషన్లకు తిప్పి సిసిలీలోని వైసీపీ నేతకు చెందిన రాజ్యలక్ష్మి ఫ్యాక్టరీలో బంధించారని ఆరోపణలు వస్తున్నాయి. రాత్రంతా తిప్పుతూ తమను విచక్షణారహితంగా పోలీసులు దాడి చేశారని వాలంటీర్లు ఆరోపిస్తున్నారు. నరసాపురం, వీరవాసరం, భీమవరం స్టేషన్లకు తిప్పారని తమపై దాడి చేసిన వైసీపీ కార్యకర్తలను వదిలేసి దెబ్బలు తిన్న తమను అరెస్ట్ చేయడం ఏంటని వాలంటీర్లు ప్రశ్నిస్తున్నారు. తమపై ఐపిసి సెక్షన్ 307 కింద కేసు నమోదు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
ఈ క్రమంలోనే జగన్ పై లోకేష్ పైర్ అయ్యారు. ఇది పోలీసుల వైఫల్యం అని, రోడ్డు పక్కన ఉన్న భవనాలు ఎక్కి దాడి చేస్తున్నా వైసీపీ కార్యకర్తలకు పోలీసులు అండగా నిలవడంపై లోకేష్ ఫైర్ అయ్యారు. ఈ ఘటనపై టిడిపి నేత బోండా ఉమా నిప్పులు చెరిగారు. పాదయాత్రకు ఆటంకం కలిగించాలని పథకం ప్రకారం జగన్ ఈ గొడవ చేయిస్తున్నారని ఆరోపించారు. పాదయాత్రకు వస్తున్న ఆదరణను తట్టుకోలేక ఇలా దాడులకు తెగబడుతోందని మండిపడ్డారు. యువగళం పాదయాత్రలో వైసిపి గూండాలకు పనేంటని ప్రశ్నించారు. లోకేష్ కు భద్రత పెంచాలని డీజీపీకి ఎన్నిసార్లు లేఖ రాసినా స్పందించలేదని, పాదయాత్రను అడ్డుకుంటే చూస్తూ ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు.