సీఎం జగన్‌కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బహిరంగ లేఖ రాశారు. “సీఎం గారూ.. ఇప్పటికైనా కళ్లు తెరవండి“ అని హెచ్చరించారు. సీఎం గా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన నుంచీ ఒక్కో రంగం సంక్షోభంలో కూరుకుపోవడం, యాధృచ్చికమో, మీ ప్రభుత్వ నిర్లక్ష్యమో తెలియదు కానీ లక్షలాది మందిపై దీని ప్రభావం తీవ్రంగా పడుతోందని తెలిపారు. ఇసుక పాలసీ మార్చి భవన నిర్మాణ రంగాన్ని, దానికి అనుబంధంగా వున్న 130కి పైగా వ్యవస్థల్ని అస్తవ్యస్తం చేసేశారని దుయ్యబట్టారు.
వందలాది మంది భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలకు కారకులయ్యారని లోకేష్ ఆందోళన వ్యక్తం చేశారు. అనాలోచిత విధానాలతో విద్యుత్ కోతలు ఆరంభించి పరిశ్రమలకి పవర్‌హాలీడే ప్రకటించేలా చేశారని, విత్తనాలు, ఎరువులు, పెట్టుబడులు అన్నీ పెరిగి మద్దతు ధర తగ్గిపోయిన గడ్డు పరిస్థితుల్లో ప్రభుత్వం ఆదుకోకపోవడంతో రైతులు పంటలు వేయకుండా క్రాప్‌హాలీడే పాటిస్తున్నారని తెలిపారు. అన్నదాతల ఆత్మహత్యల్లో ఏపీ 3వ స్థానంలో వుండటం వ్యవసాయరంగం దుస్థితిని తేటతెల్లం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఒక్కో రంగం కుదేలవుతున్నా మీ ప్రభుత్వం కనీస ఉపశమన చర్యలు తీసుకోకపోవడంతో ఇప్పుడు ఆక్వా రంగం కూడా సంక్షోభంలో పడిందని తెలిపారు. విద్యుత్ చార్జీల పెంపు, ఫీడ్ ధర అధికం కావడం, రొయ్యల ధర తగ్గిపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆక్వా హాలీడే ప్రకటించాలని రైతులు తీసుకున్న నిర్ణయంపై ప్రభుత్వం ఇప్పటివరకూ స్పందించకపోవడం విచారకరమని లోకేష్ వ్యాఖ్యానించారు. ఫీడ్ కేజీకి రూ.20, మినరల్స్, ఇతర మందుల ధరలు 30 శాతం పెరిగినా మీదృష్టికి ఈ సమస్య రాకపోవడం విచిత్రమే నని ఎద్దేవా చేశారు.
రొయ్యల రేటు మాత్రం ఏ కౌంటు అయినా కేజీ సుమారు 70 నుంచి 150 వరకూ తగ్గినా మీ నుంచి స్పందన శూన్యమని విమర్శించారు. ఆక్వారంగానికి మేలు చేస్తానని హామీలు ఇచ్చిన మీరు అధికారంలోకి వచ్చాక తెచ్చిన తరువాత ఫీడ్-సీడ్ యాక్ట్ లతో రైతులు తీవ్రంగా నష్టపోయేలా చేశారని అన్నారు. ఆక్వారంగంలో డబుల్ డిజిట్ గ్రోత్ వుండాలని నిర్దేశించిన అప్పటి సీఎం చంద్రబాబు గారు రెండు విడతల్లో (ఒకసారి 0.77పైసలు, మరోసారి రూ. 1.86 పైసలు) యూనిట్ విద్యుత్‌పై రూ. 2.63 పైసలు తగ్గించడంతో అప్పటివరకూ ఆక్వా రైతులు 1 యూనిట్‌కి రూ. 4.63 పైసలు చెల్లించే విద్యుత్ చార్జీలు రూ.2కి తగ్గడంతో భారం తగ్గి మేలు చేకూరిందని లోకేష్ తెలిపారు.
ప్రతిపక్షనేతగా పాదయాత్రలో మీరు ఆక్వా రైతులకి యూనిట్ విద్యుత్ ను రూ. 1.50 పైసలకే ఇస్తానని హామీ ఇచ్చారని లోకేష్ గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చాక 0.50 పైసలు తగ్గించి, మళ్లీ రూ.2.36 పైసలు పెంచి దారుణంగా మోసగించారని దుయ్యబట్టారు. ఆక్వా జోన్ పరిధిలోని రైతులకు మాత్రమే సబ్సిడీ పేరుతో 80 శాతం మందికి సబ్సిడీలు ఎత్తివేయడం ముమ్మాటికీ ఆక్వారైతులకు ద్రోహం చేయడమే సీఎం గారూ అని వ్యాఖ్యానించారు. దయచేసి మీరు ఆక్వారంగం సంక్షోభంలో పడకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నానని లోకేష్ వ్యాఖ్యానించారు.
Comments 1