తిరుపతి రుయా ఆసుపత్రిలో మానవత్వం మంటగలిసింది. అంబులెన్సు డ్రైవర్ల ఆగడాలకు ఓ తండ్రి అసహాయుడిగా మారిపోయాడు. డబ్బు పిశాచి పట్టిన అంబులెన్స్ డ్రైవర్లు ధందా చేస్తూ పేదలను పట్టి పీడిస్తున్నారు. కొడుకు చనిపోయిన బాధలో ఉన్న ఓ కన్నతండ్రి నిస్సహాయతకు అంబులెన్సు డ్రైవర్లు కరగలేదు. ప్రైవేటు అంబులెన్స్ డ్రైవర్ల మాఫియా ఆగడాలకు ఆ తండ్రి తన కొడుకు మృతదేహాన్ని బైకుపై తీసుకెళ్లిన ఘటన ఏపీలో వైద్య శాఖలోని లోపాలను బట్టబయలు చేసింది.
రుయా అంబులెన్సు డ్రైవర్లు.. కేవలం 90 కిలోమీటర్ల దూరానికి రూ.10 వేలు అడిగి దౌర్జన్యం చేసిన ఈ ఘటన వైరల్ అయింది. అంతేకాదు.. ఉచిత అంబులెన్సు వచ్చినా సరే ఆ డ్రైవర్ ను ప్రైవేటు అంబులెన్స్ డ్రైవర్లు బెదిరించి తన్నితరిమేయడంతో చివరకు బైకుపై తన కొడుకు శవాన్ని ఆ తండ్రి తీసుకువెళ్లాడు. ఇలాంటి ఘటనలు ఇంతకుముందు కూడా జరిగాయని, అయినా కూడా అంబులెన్సు డ్రైవర్ల ఆగడాలకు ప్రభుత్వం అడ్డుకట్ట వేయడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఈ ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద వరుసగా అమానవీయ ఘటనలు జరుగుతున్నాయని, మొన్న ప్రభుత్వ ఆసుపత్రిలో యువతిపై గ్యాంగ్ రేప్, నేడు ప్రైవేట్ అంబులెన్స్ ల ధందా వంటి ఘటనల నేపథ్యంలో అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? అన్న అనుమానం కలుగుతోందన్నారు. చేతగాని పాలకుడు జగన్ గారి చెత్త పాలన కారణంగా కొడుకు మృతదేహాన్ని తండ్రి 90 కి.మీ. బైక్ పై తీసుకెళ్లాల్సిన అగత్యం ఏర్పడిందని మండిపడ్డారు.
గత తెలుగుదేశం ప్రభుత్వం పార్థివ దేహాన్ని ఉచితంగా తరలించేందుకు మహాప్రస్థానం రవాణా వాహనాలను ఏర్పాటు చేసిందని లోకేష్ గుర్తు చేశారు. వాటిని వైసీపీ సర్కార్ నిర్వీర్యం చెయ్యడంతోనే ప్రైవేట్ అంబులెన్స్ దందా పెరిగి ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ఇప్పటికైనా సీఎం గారు నిద్రలేచి ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరిస్థితులు మెరుగుపర్చాలని లోకేశ్ డిమాండ్ చేశారు.