ఆవు చేలో మేస్తే….దూడ గట్టున మేస్తుందా ? వైసీపీ అధినేత జగన్ పదో తరగతి పేపర్లు ఎత్తుకొస్తే…ఆ పార్టీ నేతలు తమ పిల్లలే పదో తరగతి టాపర్లుగా ఉండాలని బెదిరింపులకు దిగకుండా ఉంటారా? చిత్తూరు జిల్లా పలమనేరులో నిరుపేద టెన్త్ విద్యార్ధిని మిస్బా ఆత్మహత్య ఘటన చూస్తే ఆ కొటేషన్ నిజమనిపించక మానదు. తన కూతురే స్కూల్ టాపర్ గా ఉండేందుకు మిస్బా అనే విద్యార్థినిని స్కూల్ మాన్పించిన వైసీపీ నేత సునీల్ వైఖరిపై ఇపుడు తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పలమనేరుకు చెందిన నజీర్ అహ్మద్, నసీమాలు కూలీ పనులతో పాటు సోడాలు అమ్ముకుని జీవిస్తున్నారు. వారి కూతురు మిస్బా స్థానిక బ్రహ్మర్షి హైస్కూల్లో పదో తరగతి చదువుతోంది. టెన్త్ లో క్లాస్ టాపర్‌గా వస్తోన్న మిస్బాతో అదే పాఠశాలలో చదువుతున్న వైసీపీ నేత సునీల్ కూతురు పూజిత పోటీపడుతోన్న మొదటి స్థానం దక్కడం లేదు. దీంతో, తన కూతురే క్లాస్ లో టాపర్ గా రావాలన్న కుటిల బుద్ధితో వైసీపీ నేత సునీల్ ఏ తండ్రి చేయకూడని పని చేశాడు.
మిస్బాను స్కూల్ నుంచి వెళ్లగొడితే తప్ప తన కూతురు పూజిత టాపర్‌గా నిలవదని సునీల్ ఫిక్సయ్యారు. అందుకే మిస్బా కుటుంబ పేదరికాన్ని తూలనాడుతూ ఆమెను పాఠశాల నుంచి వెళ్లగొట్టాలని బ్రహ్మర్షి స్కూల్ ప్రిన్సిపల్ కు నూరిపోశారు. దీంతో, మిస్బాను అవమానిస్తూ వేరే స్కూల్ చేరేలా ప్రిన్సిపాల్ ఒత్తిడి చేశారు. రాజకీయ పలుకుబడి ఉన్న సునీల్ తో తలపడలేని ఆ నిస్సహాయ తల్లిదండ్రులు ఆమెను వేరే పాఠశాలలో చేర్పించారు.
అయితే, తనకు జరిగిన అవమానాన్ని పదే పదే గుర్తు చేసుకున్న మిస్బా..ఈ స్కూల్లో టాపర్‌గా నిలిచినా మరెవరో నేత వచ్చి స్కూల్ మార్చరన్న నమ్మకం కోల్పోయింది. దీంతో, మిస్బా బలవన్మరణానికి పాల్పడింది. తన చావుకు దారి తీసిన కారణాలను వివరిస్తూ ఆమె ఏకంగా రెండు పేజీల లేఖ రాసిందంటే ఆమె ఎంత వేదనకు గురైందో అర్థమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు.
మిస్బా ఆత్మహత్యకు కారకులైన వైసీపీ నేతలు తాలిబాన్లను మించిన కరడుగట్టిన ఉగ్రవాదులని మండిపడ్డారు. వైకాపాకన్ల కంటే కూడా తాలిబాన్లు నయమని, పదో తరగతి పేపర్లు ఎత్తుకొచ్చిన చరిత్ర జగన్‌దని, అందుకే ఆయన పార్టీ నేతలది పదో తరగతిలో తన కూతురు టాపర్‌గా నిలవాలన్న భావన అని ఎద్దేవా చేశారు. ఆ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడేలా చేసిన నీచ చరిత్ర వైసీపీ నేతలదంటూ లోకేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.