పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఏఫీలో టీడీపీ నేతల అరెస్టులు, దాడుల ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. నిమ్మాడలో వీరంగం వేసిన వైసీపీ నేత దువ్వాడ శ్రీనివాస్ ను వదిలేసి…నామినేషన్ వేసిన తన బంధువుతో మాట్లాడిన అచ్చెన్నను అరెస్టు చేయడంపై విమర్శలు వస్తున్నాయి. ఇక, విజయవాడలో పట్టపగలు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిపై దాడి జరగడం చర్చనీయాంశమైంది. ఈ వరుస ఘటనల వేడి సద్దుమణగకముందే తూర్పుగోదావరి జిల్లా గొల్లలగుంటలో అనుమానాస్పదస్థతిలో టీడీపీ కార్యకర్త శ్రీనివాసరెడ్డి అనుమానాస్పద మృతి ఘటక కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ పై టీడీపీ జాతీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ మండిపడ్డారు. శ్రీనివాసరెడ్డిది ప్రభుత్వ హత్య అని… ఈ పాపం జగన్కు తగులుతుందని దుయ్యబట్టారు.
వైఎస్ఆర్ ఎలా చనిపోయారో జగన్ తెలుసుకోవాలని లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అచ్చెన్న అరెస్టు, పట్టాభిపై దాడి వంటి ఘటనల పాపాలన్నీ జగన్ కు అంటుకుంటాయని లోకేష్ మండిపడ్డారు. ఇది టీడీపీకి, వైసీపీకి మధ్య పోరాటం కాదని, ఇది అంబేద్కర్ రాజ్యాంగానికి, రాజారెడ్డి రాజ్యాంగానికి మధ్య జరుగుతున్న పోరాటమని నిప్పులు చెరిగారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ వైసీపీ కండువా కప్పుకున్నారని లోకేష్ విమర్శించారు.ఏపీలో తాళిబొట్లు తెంపేస్తున్నారని, 13 మంది టీడీపీ కార్యకర్తలను హత్య చేశారని లోకేష్ ఆరోపించారు. పట్టాభిపై దాడి చేశారని, అచ్చెన్నపై అక్రమ కేసు బనాయించి జైలుకు పంపారని మండిపడ్డారు. శ్రీనివాసరెడ్డి హత్యకు కారణమైన ముగ్గురిని అరెస్ట్ చేయాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు.