టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఉండవల్లి ప్రాంతంలో పర్యటించిన లోకేష్ అక్కడి ప్రజలకు క్షమాపణలు చెప్పారు. రెండు చేతులు జోడించి తనను క్షమించాలని నారా లోకేష్ కోరడం సంచలనం రేపుతోంది. అక్కడ ప్రజలతో మమేకమైన లోకేష్….వారి బాధలను చూసి చలించిపోయి భావోద్వేగానికి గురైన వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
టిడిపి హయాంలో సీతా నగర్ ఘాట్ వద్ద నివాసాలను తొలగించి వారికి ఉండవల్లి దగ్గర స్థలాలు ఇచ్చి పునరావాసం కల్పించాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని వసతులతో కూడిన చక్కటి ఇల్లు నిర్మించి ఇస్తామని టిడిపి నేతలు హామీ ఇచ్చారు. అయితే, ఆ తర్వాత ఎన్నికలు రావడం, అనంతరం టిడిపి ప్రభుత్వం ప్రతిపక్షానికే పరిమితం కావడం వంటి కారణాలతో ఆ ఇళ్ల నిర్మాణం పూర్తి కాలేదు. ఈ క్రమంలోనే ఉండవల్లిలో లోకేష్ పర్యటించిన సందర్భంగా అక్కడి ప్రజల పరిస్థితి చూసి చలించిపోయారు.
అధికారంలో ఉన్నప్పుడు త్వరితగతిన ఇల్లు కట్టించి ఉంటే ఈ ఇబ్బందులు వచ్చి ఉండేవి కాదని, ఈ పరిస్థితికి కారణమైన తమను క్షమించాలని లోకేష్ వినమ్రంగా కోరారు. అంతేకాదు, రాబోయే ఎన్నికల్లో టిడిపి ఘన విజయం సాధిస్తుందని, అప్పుడు అందరికీ అన్ని వసతులతో కూడిన ఇళ్లు కట్టించి ఇస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక అవి చేస్తాం ఇవి చేస్తాం అని చెప్పిన వైసీపీ అధినేత జగన్ హామీలు నెరవేర్చకుండానే తిరుగుతున్న నేపథ్యంలో గతంలో తామిచ్చిన మాట తప్పినందుకు లోకేష్ క్షమాపణ కోరడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనతో ఇదీ జగన్, లోకేష్ ల మధ్య ఉన్న తేడా అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి.