ఒక్క చాన్స్..ఒకే ఒక్క చాన్స్ అంటూ ఖడ్గం సినిమాలో రవితేజలాగా కనిపించిన ప్రతి ఓటరును ప్రాధేయపడిన జగన్…నానా తంటాలు పడి సీఎం అయ్యారు. అయితే, పోనీలే పాపం అని జగన్ కు ఒక్క చాన్స్ ఇచ్చిన జనానికి మాత్రం జగన్ చుక్కలు చూపిస్తున్నారు. ఓ పక్క పన్ను పోటు…మరో పక్క కరెంటు బిల్లుల షాక్ లు…తగ్గని పెట్రో, డీజిల్, నిత్యావరసర సరుకుల రేట్లు…వెరసి సామాన్యుడి నడ్డి విరుస్తోందీ ప్రభుత్వం.
ప్రభుత్వ వ్యతిరేకత ఉవ్వెత్తున్న లేస్తున్నా, ప్రజల ఆగ్రహ జ్వాలలు మిన్నంటున్నా…అవేమీ పట్టనట్లు వ్యవహరిస్తోన్న జగన్…తాజాగా మూడేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నారు. దీంతో, ముచ్చటగా మూడేళ్ల పాలన సంబరాలలో వైసీపీ నేతలు, కార్యకర్తలు మునిగితేలుతున్నారు. అయితే, జగన్ మూడేళ్ల పాలనలో ఏపీ ముఫ్ఫై ఏళ్లు వెనక్కు వెళ్లిందని టీడీపీ, విపక్ష నేతలు విమర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు.
జగన్ ను లోకేష్ పదునైన విమర్శలతో ఎద్దేవా చేశారు. జగన్ రెడ్డి గారి మూడేళ్ల పాలనను మూడు మాటల్లో చెబుతూ సీఎం పరువు తీశారు లోకేష్. విద్వేషం, విధ్వంసం, విషాదం అంటూ జగన్ పాలనను లోకేష్ ఏకిపారేశారు. ఈ మూడేళ్లలో జగన్ సాధించింది శూన్యమని లోకేశ్ చురకలంటించారు. అంతేకాదు, రాబోయే రెండేళ్లలో రాష్ట్రం సర్వనాశనం కావడం ఖాయమని లోకేష్ జోస్యం చెప్పారు.
జగన్ విద్వేషానికి సంబంధించి రామతీర్థంలో రాముని తల నరికవేత ఫొటోను, విధ్వంసానికి సంబంధించి ప్రజావేదిక కూల్చివేతను, విషాదానికి సంబంధించి ఎల్జీ పాలిమర్స్ విషాద ఘటన ఫొటోను షేర్ చేస్తూ లోకేష్ ట్వీట్ చేశారు. మరి, లోకేష్ ట్వీట్ పై జగన్, వైసీపీ నేతల స్పందన ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.
అంతకుముందు, ‘‘రెండు వేల కీలక పదవులు ఒకే సామాజిక వర్గానికి…కుర్చీలు కూడా లేని పదవులు బిసిలకా? చెయ్యాల్సింది సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర కాదు జగన్ ” రెడ్డి ” సామాజిక రైలు యాత్ర. వాస్తవానికి రైలు కూడా సరిపోనన్ని పదవులు ఒకే సామాజిక వర్గానికి దక్కాయి. వైసిపి పాలనలో సామాజిక న్యాయం ఎక్కడ? తాడేపల్లి ప్యాలెస్ లోపల సజ్జల రెడ్డి, సాయిరెడ్డి, సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి. గేటు బయట బిసి, ఎస్సీ, ఎస్టీ నేతలు. ఆయన వద్ద అటెండర్ దగ్గర నుండి ఐఏఎస్ వరకూ ఒకే సామాజిక వర్గం’’ అని లోకేష్ ట్వీట్ చేశారు. ఇక, జనం న్యాయభేరి సభకు రాకుండా వెళ్తారన్న భయంతో యువతులతో డ్యాన్స్ లు చేయించిన వీడియోను కూడా లోకేష్ ట్విటర్ లో షేర్ చేశారు.
https://twitter.com/i/status/1530864141069877249