టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర నాలుగో రోజు దిగ్విజయంగా కొనసాగుతోంది. కుప్పం నియోజకవర్గంలో తొలి మూడు రోజులు పాదయాత్ర చేసిన లోకేష్ నాలుగో రోజు పలమనేరు నియోజకవర్గంలోకి ప్రవేశించారు. ఈ సందర్భంగా వడ్డెర సంఘం సమావేశంలో లోకేష్ పాల్గొన్నారు. జగన్ 10 రూపాయలు ఇచ్చే కార్యక్రమాలపై నవ్వుతున్న జగన్ ఫోటో ఉంటుందని అదే జనం దగ్గర నుంచి 100 రూపాయలు లాక్కునే కరెంట్ బిల్లు, ఆర్టిసి టికెట్లు, చెత్త పన్ను, ఇంటి పన్ను వంటి కార్యక్రమాల పోస్టర్లపై జగన్ బొమ్మ ఉండదంటూ లోకేష్ ఎద్దేవా చేశారు.
వడ్డెర సమాజంలో పేదరికం ఎక్కువగా ఉందని, దానిని పరిష్కరించేందుకు సత్యదేవ్ కమిటీని గతంలో చంద్రబాబు వేశారని గుర్తు చేశారు. ఆ నివేదికను జగన్ సర్కార్ దాచిపెట్టిందని ఆరోపించారు. జగన్ సీఎం అయిన తర్వాత వడ్డెర కార్పొరేషన్ నుంచి ఎలాంటి సంక్షేమ పథకాలు రాలేదని, గతంలో చంద్రబాబు వడ్డెర ఫెడరేషన్ ఏర్పాటు చేసి 70 కోట్లు ఖర్చు చేశారని గుర్తు చేశారు. వడ్డెరల కులవృత్తి అయిన క్వారీల వ్యాపారాన్ని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాగేసుకున్నారని ఆరోపించారు. చంద్రన్న బీమా కింద వడ్డెరలు ప్రమాదవశాత్తు చనిపోతే 5 లక్షలు వచ్చేవని, ఇప్పుడు ఏమీ రావడం లేదని విమర్శించారు.
టీడీపీ అధికారంలోకి వస్తే ఆ బీమా మొత్తాన్ని 10 లక్షలకు పెంచుతామని, పెద్దిరెడ్డి లాక్కున్న క్వారీలను తిరిగి వడ్డెరులకు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. ఇక, జగన్ మాదిరి అబద్ధాలు చెప్పి తాను పారిపోనని అన్నారు. జగన్ ధరలబాదుడికి కుప్పం, పలమనేరు ప్రజలు పొరుగు రాష్ట్రం కర్ణాటకకు వలసపోతున్నారని విమర్శించారు. ఈ అన్యాయాలను ప్రశ్నించిన తనపై 15 కేసులు పెట్టారని, అందులో హత్యాయత్నం కేసు కూడా ఉందని ఆరోపించారు. సైకో పాలనుపై పోరాడుదాం అని, సైకో ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు కలిసి రావాలని లోకేష్ పలమనేరు ప్రజలకు పిలుపునిచ్చారు.