పాలక, ప్రతిపక్షాల మధ్య వాద సంవాదాలు ప్రతి రోజూ తీవ్రం అవుతున్నాయి. మాట్లాడే వారి సంఖ్య ఇరు వర్గాల్లోనూ నానాటికీ పెరిగిపోతోంది. తాజాగా ఏసీబీని మరింత యాక్టివ్ చేసేందుకు డిజిటల్ మీడియాలో ఓ యాప్ ను ప్రవేశపెట్టారు. కరప్షన్ ఫ్రీ ఆంధ్రా అనే స్లోగన్ తో తాను పనిచేయనున్నానని జగన్ అంటున్నారు.
క్షేత్ర స్థాయిలో ఏ విధంగా అయినా అవినీతి ఉంటే సహించబోనని అంటున్నారు. ఇవే ఇప్పుడు టీడీపీకి అస్త్రాలు అవుతున్నాయి. ఆయన మాటలకు ప్రతిగా కొన్ని మాటలు లోకేశ్ చెబుతున్నారు. జగన్ ను ఉద్దేశించి సోషల్ మీడియాలో లోకేశ్ కౌంటర్లు వేశారు.
నిన్నటి వేళ ఏసీబీ యాప్ ఆవిష్కరించారు. దానికి కొనసాగింపుగా ఇవాళ తన సొంత పత్రిక సాక్షిలో అదేవిధంగా ఈనాడులో ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చారాయన. ఇవే ఇప్పుడు విపక్షం వాకిట చర్చకు తావిస్తున్నాయి. గతంలో అనేక అక్రమాస్తుల కేసుల్లో ఇరుక్కుపోయిన జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా రాష్ట్రంలో జరిగే అవినీతిని అరికడతారో చెప్పాలని టీడీపీ అంటోంది. డిమాండ్ చేస్తోంది.
“దేశంలోనే అత్యంత అవినీతి పరుడై సీబీఐ, ఈడీ కేసులు ఎదుర్కొంటోన్న జగన్‌రెడ్డి అవినీతిని అరికడదామంటూ యాప్ ఆవిష్కరించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే. యాప్‌కి 14400 నెంబర్ కాకుండా, 6093 అయితే యాప్ట్‌గా ఉండేది. అవినీతి చూస్తూ ఉండొద్దు, అవినీతి గురించి వింటూ ఉండొద్దు, అవినీతికి వ్యతిరేకంగా గొంతు విప్పండి అంటూ లెక్చర్ ఇస్తోన్న అవినీతి అనకొండ YS Jagan Mohan Reddy గారూ అవినీతిపై ఈ నేతిబీర కబుర్లు మాని.. మీపై ఉన్న అవినీతి కేసులు విచారణ త్వరితగతిన పూర్తి చెయ్యాలని కోరే దమ్ముందా?” అని లోకేష్ వ్యాఖ్యానించారు.
అక్రమాస్తుల కేసుల లెక్క తేలకుండానే ఏసీబీని, తదితర దర్యాప్తు సంస్థలనూ బలోపేతం చేస్తామనడం హాస్యాస్పదం గా ఉందంటూ టీడీపీ అభిప్రాయం వ్యక్తం చేస్తోంది.