అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసన మండలిలో వైసీపీ వర్సెస్ టీడీపీ అన్న రీతిలో మాటల యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలోనే వైసీపీ సభ్యులు, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యన్నారాయణ…మంత్రి లోకేశ్ ల మధ్య మాటల తూటాలు పేలాయి. లోకేశ్ మాట్లాడుతుండగా పదే పదే వైసీపీ సభ్యులు అడ్డుతగలడంతో మండలి ఛైర్మన్ కూడా అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే వైసీపీ సభ్యుల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్నిన లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఎమ్మెల్సీ ఒకరు శవాన్ని డోర్ డెలివరీ చేశారు..అంటూ లోకేశ్ చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి.
ప్రత్యేక హోదా ఎందుకు తేవడం లేదు అని బొత్స అడిగిన ప్రశ్నకు లోకేశ్ దీటుగా సమాధానమిచ్చారు. మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని జగన్ అన్న విషయాన్ని లోకేశ్ గుర్తు చేశారు. టీడీపీ, జనసేన కలిసి ఎన్డీయేకు మద్దతు తెలిపాయని, ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కారు వస్తుందని ముందుగానే చెప్పామని గుర్తు చేశారు. అంతేకాదు, అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.13 వేల కోట్ల నిధులు రాష్ట్రానికి తీసుకొచ్చామని అన్నారు. అమరావతి, పోలవరానికి కేంద్రం నుంచి నిధులు సాధించామని, విశాఖ రైల్వే జోన్, విశాఖ ఉక్కును కాపాడుకున్నామని తెలిపారు. వైసీపీ ఐదేళ్లలో ఏం సాధించిందో చెప్పాలని లోకేశ్ నిలదీశారు.
రాష్ట్ర ప్రయోజనాల కోసమే కేంద్రంలో ఎన్డీఏకు మద్దతిచ్చామని లోకేశ్ చెప్పారు. కానీ, తమపైనే కేంద్రం ఆధారపడింది అని తాము చెప్పినట్లు వైసీపీ సభ్యులు వక్రీకరించి మాట్లాడడం సరికాదన్నారు. ఇక, 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని కూటమి నేతలు చెప్పినట్లు వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ఆరోపించారు. దీంతో, ఆమెకు లోకేశ్ కౌంటర్ ఇచ్చారు. 4 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ముందుకు పోతున్నామని మాత్రమే చెప్పామని క్లారిటీనిచ్చారు. వైసీపీ సభ్యులు వాస్తవాలు మాట్లాడాలని హితవు పలికారు. అయినా, వైసీపీ సభ్యులు వాకౌట్ చేయకుండా కూర్చొని చర్చిస్తే అన్ని విషయాలపై స్పష్టత వస్తుందని చురకలంటించారు. దీంతో, వైసీపీ వాకౌట్ పై లోకేశ్ నాకౌట్ పంచ్ ఇచ్చినట్లయింది.