విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ లో బోట్లు అగ్నికి ఆహుతి అయిన ఘటన ఇరు తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపింది. దాదాపు 40 బోట్లు అగ్నిప్రమాదంలో దగ్ధం అవడంతో 50 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్టుగా తెలుస్తోంది. ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది దాదాపు 5 గంటల శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. హార్బర్లోని ఒకటో నెంబర్ జెట్టి దగ్గర ఈ ప్రమాదం జరిగింది. బోట్లలో నిల్వ ఉన్న పెట్రోల్, డీజిల్ ఉండడంతో మంటలు మరింత ఎగసిపడ్డాయి.
అయితే, బోట్ల యజమానుల మధ్య గొడవ వల్లే మద్యం మత్తులో కొందరు కావాలనే ఓ బోటుకు నిప్పు పెట్టినట్టుగా పుకార్లు వస్తున్నాయి. ఆ బోటు నుంచి ఇతర బోట్లకు మంటలు వ్యాపించాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనపై ఏపీ సీఎం జగన్ తో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం జగన్….బాధితులను ఆదుకోవాలని, లోతైన దర్యాప్తు జరపాలని ఆదేశించారు. మత్స్యకారులకు అండగా ఉండి తగిన సాయం చేయాలని అధికారులకు సూచించారు. ఈ ఘటనపై పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.
మత్స్యకారులకు చెందిన 40 బోట్లు, మత్స్య సంపద అగ్నికి ఆహుతి కావడం బాధ కలిగించిందని లోకేష్ అన్నారు. షిప్ యార్డ్ ప్రాంతంలో భద్రతాచర్యల వైఫల్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఈ ఘటన నిదర్శనమని లోకేష్ అన్నారు. ఈ ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించి మత్స్యకారులను, బోటు యజమానులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.