రాష్ట్ర మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ నారా లోకేష్ పాదయాత్రను అడ్డుకుంటామని చేసిన ప్రకటన వైసీపీలో కలకలం సృష్టించింది. టీడీపీ యువ నేత నారా లోకేష్ యువగళం పేరిట చేపట్టబోయే పాదయాత్రను అడ్డుకోవడం వల్ల ఒరిగే లాభమేమీ లేదని వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి. దానివల్ల పార్టీకి అపవాదే తప్ప కించిత్తు కూడ ప్రయోజనం ఉండదని మెజార్జీ నేతలు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం.
టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ జనవరి 27 నుంచి పాదయాత్ర చేయనున్నట్టు ప్రక టించారు. యువగళం పేరుతో ఆయన పాదయాత్రకు రెడీ అవుతున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో కూడా విడుదల చేశారు. ఈ పాదయాత్రకు సంబంధించి పతాకాన్ని కూడా ఆవిష్కరించారు.
మొత్తం 400 రోజుల పాటు 4000 కిలోమీటర్ల దూరం నడవాలని లోకేష్ నిర్ణయించుకున్నారు. ఆయన పాదయాత్రకు సంబంధించి ఏర్పాట్లు టీడీపీలో చకచకా జరిగిపోతున్నాయి. ఆయన నడిచే రూట్ మ్యాప్ మాత్రం బయటకు రావాల్సి ఉంది.
ఇంతలోనే వైసీపీ మంత్రి మేరుగ నాగార్జున లోకేష్ పాదయాత్రపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం సృష్టిస్తున్నాయి. లోకేష్ ఏ ఉద్దేశంతో పాదయాత్ర చేస్తున్నారని ప్రశ్నించారు. అంతే కాదు లోకేష్ పాదయాత్రను అపేస్తామని ఘంటాపథంగా చెప్పారు. గతంలో అమరావతి రైతుల పాదయాత్రను ఆపేశాం, ఇప్పుడు లోకేష్ వంతు వచ్చింది, దాన్ని కూడా ఆపేస్తామని ఆయన ప్రకటన చేశారు.
మంత్రి నాగార్జున వ్యాఖ్యలపై ఇంకా టీడీపీ రియాక్ట్ కాలేదు. కానీ మంత్రిగారి సొంతపార్టీ వైసీపీలోనే ఆయన వ్యాఖ్యలపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. లోకేష్ పాదయాత్రను అడ్డుకోవడమనేది తొందరపాటు చర్యే అవుతుందని నేతలు అభిప్రాయపడుతున్నారు.
పాదయాత్రను అడ్డుకోవడం వల్ల వైసీపీ ఒనగూరే ప్రయోజనం ఏమీ ఉండదు, పైగా పెద్ద అపవాదు కూడా మూటగట్టుకోవాల్సి వస్తుందని గుంటూరు చెందిన సీనియర్ నేతలుఅంటున్నారు.. గతంలో తమ నేతే జగన్ కూడా పాదయాత్ర చేశారని, దాన్ని ఎవరూ అడ్డుకోలేదన్న విషయాన్ని మనం గుర్తించుకోవాల్సిన అవసరముందని మరికొందరు నేతలు అంటున్నారు.
“పాదయాత్రను అడ్డుకుంటే ఏమొస్తుంది? అపవాదు తప్ప. గతంలో మా నాయకుడు కూడా పాదయాత్ర చేశారు. అప్పుడు ఇలానే అడ్డుకుని ఉంటే.. బాగుండేదా? ఇలాంటి ఆలోచనలు సరికాదు. ఇలా చేస్తే.. టీడీపీకి మరింత ప్రచారం కల్పించినట్టు అవుతుంది. వాళ్లు కోర్టుకు వెళ్తారు. అప్పుడు ఏం చేస్తారు. అది బాగుటుందా.? ప్రభుత్వం పై మచ్చపడదా?” అని గుంటూరుకు చెందిన ఓ నేత మీడియా ముందు మైకు ఆఫ్ చేసి ఆఫ్ ది రికార్డులో వాపోయారు.
యువగళం వినిపించడానికి యువదళమై కదలిరండి
నారా లోకేష్ గారితో కలిసి కదంతొక్కండి#YuvaGalam#LokeshPadayatra #NaraLokesh#NaraLokeshForPeople pic.twitter.com/ryV5xzzG0j— Telugu Desam Party (@JaiTDP) December 28, 2022